రాజధాని ప్రాంత రైతులు టీడీపీ అధినేత నారా చంద్రబాబును కలిశారు. రాజధాని ప్రాంతంలోనే ఉండాలంటూ చంద్రబాబుకు వారు విజ్ఞప్తి చేశారు. తామే ఇళ్లు నిర్మించి ఇస్తామన్న రైతుల విజ్ఞప్తికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. రైతులు ఇష్టపూర్వకంగానే రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని చంద్రబాబు మరోమారు అన్నారు.
వైసీపీ ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నంలోనే టీడీపీపై విమర్శలు చేస్తుందని, రాజధాని నిర్మాణానికి తాము ఇచ్చిన పిలుపు మేరకు భూములు ఇచ్చారని, కానీ జగన్ ప్రభుత్వం మాత్రం తమపై రాజకీయ లబ్ది కోసం అనవసర రాద్దాంతం చేస్తుందని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నారా చంద్రబాబుపై విమర్శలు చేయడం సభ్యత కాదని చంద్రబాబును కలిసిన మహిళలు అన్నారు. తాము ప్రేమపూర్వకంగా రాజధానికి స్థలాలు ఇచ్చామని వారు చెప్పారు. ప్రజావేదిక కూల్చడాన్ని.. తమ ఇళ్లు పడగొట్టినట్టుగా తాము భావిస్తున్నామని, ప్రజా ధనాన్ని వృధా చేస్తున్న సీఎం జగన్ బెస్ట్ సీఎం ఎలా అవుతాడని.. వరస్ట్ సీఎంగానే మిగిలిపోతాడని వారు పేర్కొనడం గమనార్హం.