తెలంగాణలో నాలుగు రోజుల క్రితం కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణారావు అటవీశాఖ అధికారిణిపై దాడిచేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి అటు సోషల్ మీడియాలో, ఇటు మీడియా ఛానెళ్లలో తెలంగాణ చింతమనేని అంటూ కృష్ణారావుపై విస్తృత ప్రచారమే జరిగింది.
తహశీల్దార్ వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్ దాడిని, అటవీ అధికారిణిపై కృష్ణారావు చేసిన దాడిని పోలుస్తూ కథనాలు ప్రచురితమయ్యాయి. ఇదంతా చూసిన చింతమనేని తెలంగాణలో ఏదో జరిగితే నాతో పోలుస్తారా..? ఇదెక్కడి దారుణం..! ఓడిపోయాక కూడా వదిలిపెట్టరా..? అని సన్నిహితులవద్ద తెగ ఇదైపోతున్నారట చింతమనేని ప్రభాకర్.
ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత తనకు ఓట్లు వేయలేదన్న ఆగ్రహంతో రైతుల సాగునీటి పైప్‌లను చింతమనేని ప్రభాకర్ ట్రాక్టర్లో వేసుకుని తీసుకుపోయినట్టు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. అదికాస్తా తీవ్ర వివాదమైంది. దీంతో తేరుకున్న చింతమనేని ప్రభాకర్ తనకు గొడవలు, తగాదాలు వద్దంటూ ఆ పైపులను పట్టుకుపోండంటూ తన ఇంటికి వచ్చిన పోలీసులకు ఆ పైప్‌లను అప్పగించేశారు. దీనికంతటికి కారణం ఓటమి తెచ్చిన మార్పేనని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.