ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బీసీల గురించి మాట్లాడేందుకు అర్హుడు కాదని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలు ఉంటే.. ఏ ఒక్క జిల్లాకు కూడా బీసీలను వైకాపా అధ్యక్షులుగా నియమించలేదని విమర్శించారు. అటువంటి వ్యక్తి ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా వేదికగా బీసీల గర్జన పేరుతో సభ నిర్వహించడం హాస్యాస్పదమన్నారు.
ఇటీవల కాలంలో తాను టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. సోషల్ మీడియా కథనాలన్నీ కల్పితాలేనన్నారు. వైసీపీ శ్రేణులు దగ్గరుండి మరీ ఆ కథనాలను రాయిస్తున్నారని విమర్శించారు. ఆ కథనాల్లో వాస్తవం లేదన్నారు.
అయితే, త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా..? లేక ఎంపీగా పోటీ చేయాలా..? అన్న దానికి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని, ఈ దఫా ఎన్నికల నుంచి తప్పుకోమని చంద్రబాబు ఆదేశిస్తే అందుకు తాను సిద్ధమని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.