ఈ ఏడాది జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. తమ రాజకీయ జీవిత కాలంలో ఇంతటి ప్రజా వ్యతిరేకతను పార్టీ ఏనాడూ ఎదుర్కోలేదంటూ పలువురు టీడీపీ సీనియర్ నేతలు సైతం వారి అభిప్రాయాలను మీడియా సాక్షిగా బహిరంగంగా వెల్లడించారు. అంతలా వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది.
ఈ నేపథ్యంలో ఏపీలోని పలు సామాజికవర్గాల నేతలు అధికారం చేపట్టిన వైసీపీకి పూర్తి మద్దతు తెలుపగా, మరికొందరు మాత్రం తమ మద్దతు టీడీపీకే ఉంటుందని, తాము టీడీపీని వీడే ప్రసక్తే లేదంటూ చెప్పుకొస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు.
సోమవారం చంద్రబాబుతో కాపునేతల సమావేశం ముగిసిన వెంటనే తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడారు. పార్టీ ఓటమికి గల కారణాలతోపాటు కాపు నేతల సమస్యలను చంద్రబాబు వద్ద ప్రస్తావించామని, తమకు పార్టీ మారే ఆలోచన లేదని చంద్రబాబుకు చెప్పామన్నారు. వచ్చే లోకల్‌బాడీ ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు కాపు నేతలమంతా కలిసి కట్టుగా పనిచేస్తామన్నారు.
కాగా, ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తోట త్రిమూర్తులుపై తన సమీప ప్రత్యర్ధి, వైసీపీ అభ్యర్ధి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ 6,253 ఓట్లతో గెలుపొందిన సంగతి తెలిసిందే. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన తోట త్రిమూర్తులు ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో, రామచంద్రాపురం నియోజకవర్గం కాని.., చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ చేతిలో ఓటమిని చవి చూడటం గమనార్హం.