బాధ, వేదనతో కూడినటువంటి పరిస్థితుల్లో తాను టీడీపీని వీడి బీజేపీలో చేరాల్సి వచ్చిందని ఆ పార్టీ నేత అంబికా కృష్ణ అన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ అవసరం ప్రజలకు ఎంతో ఉందన్నారు. మోడీ నాయకత్వంలో బీజేపీ 300కుపైగా ఎంపీ స్థానాలను గెలుపొందిందని, ఆ ఒక్క అంశమే ప్రజలు ఏ వైపు ఉన్నారన్న విషయం స్పష్టమవుతుందని అంబికా కృష్ణ అన్నారు.
బీజేపీతో తాము కలిసివున్న సమయంలో చంద్రబాబు తీసుకున్న కొన్ని నిర్ణయాలు తనను బాధించాయని, మోడీతో మనకెందుకు గొడవ అని ఎన్నిమార్లు చంద్రబాబుకు చెప్పినా పట్టించుకోలేదని అంబికా కృష్ణ తెలిపారు. దేశం బాగుండాలని కోరుకునేవారంతా బీజేపీలో చేరాల్సిందేనని, అందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎవరిముందైనా మంచి పండు, పుచ్చిపోయిన పండు పెడితే అతను మంచిపండునే కదా ఎందుకుంటాడు.. అలానే దేశం బావుండాలని కోరుకునేవారంతా బీజేపీలో చేరాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.