ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తరుపున పోటీ చేస్తున్నానని భావించానే తప్ప.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మీద తాను పోటీ చేస్తున్నానన్న విషయాన్ని అర్ధం చేసుకోలేక పోయానని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. అదేంటి ఆళ్లగడ్డ వైసీపీ అభ్యర్ధిగా గంగుల బ్రిజేందర్‌రెడ్డి కదా బరిలో నిలిచింది..! మరి అఖిల ప్రియ వైఎస్ జగన్ మోహన్ పేరు చెప్పారేంటి..? అన్న అనుమానం అందరికి రాక మానదు. ఇదే ప్రశ్నకు అఖిలప్రియ బదులిచ్చారు.
ఈ దఫా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ బరిలో నిలిచినట్టు తమకు అనిపించిందని అఖిలప్రియ అన్నారు. ప్రతి నియోజకవర్గంలోను వైసీపీ తరుపున ఎవరు బరిలో నిలిచారు..? అన్న ప్రశ్నను పక్కన పెట్టి కేవలం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని దృష్టిలో పెట్టుకునే ప్రజలు ఓట్లు వేశారని తాము భావిస్తున్నామన్నారు.