టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, రచయితలు మొదట ఇండస్ట్రీకి చెందిన మహిళలకు అవకాశాలు కల్పించాలని, ఆ తరువాత బయట వారిని తీసుకు రావాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హేమ అన్నారు. ఇటీవల జరిగిన మా అసోసియేషన్ జనరల్‌బాడీ సమావేశంలో చోటు చేసుకున్న సంఘటనలను ఆమె గుర్తు చేశారు. చాలా మంది ఆడవారు తమకు అవకాశాలు కల్పించడం లేదంటూ, దాంతో తాము ప్రతి రోజు కడుపులు కాల్చుకుని బతకాల్సి వస్తుందంటూ కన్నీరు మున్నీరుగా విలపించారన్నారు.
తాను కావాలంటే డైరెక్టర్లు, రచయితలు, నిర్మాతల కాళ్లమీదపడమన్నా పడతా.. మొదటగా సినీ ఇండస్ట్రీకి చెందిన ఆడవారికి అవకాశాలు కల్పించండి.. ప్లీజ్.. ప్లీజ్ అంటూ దండం పెట్టారు. జనరల్ బాడీ సమావేశంలో జరిగిన విషయాలు చెప్తుంటే తన కళ్లల్లో నీళ్లు వస్తున్నాయని, దీన్నిబట్టే మహిళలు ఎంత బాధపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చన్నారు. మా అసోసియేషన్‌లో మొత్తం మీద 150 మంది వరకు మహిళలు ఉంటారు. మొదటగా వారికి అవకాశాలు కల్పించి అన్నం పెట్టలేరా..? అని నటి హేమ ప్రశ్నించారు.