ఐపీఎల్ 2021 సీజన్ దాదాపు ముగింపు దశకు చేరువైందనే చెప్పాలి. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తులు దాదాపు ఖరారు అయ్యాయి. అన్ని జట్లకంటే ముందు ప్లేఆఫ్స్‌కు చేరిన చైన్నె సూపర్ కింగ్స్ పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఈసారి ముంబయి ఇండియన్స్.. సెహ్వాగ్ కోరుకున్నట్లు ప్లే ఆఫ్స్ కూడా చేరలేకపోయింది. ప్రస్తుతం ప్రేక్షకులు ఈ సీజన్ ప్రదర్శనలపై ఆలోచిస్తుంటే.. బీసీసీఐ మాత్రం రానున్న మెగా వేలానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈసారి మరో రెండు ఫ్రాంచైజీలు చేరుతుండటంతో మరింత ఉత్కంఠ నెలకొననుంది. ఇప్పటికే అహ్మదాబాద్, లక్నో బేస్డ్ జట్లు రానున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ఫ్రాంచైజీల వాలెట్ మొత్తం కూడా 85 కోట్ల నుంచి 90 కోట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో కచ్చితంగా 75 శాతం ఖర్చు చేయాలని కూడా నిబంధన ఉంది. ప్లేయర్ రిటైన్ విధానం, షరతులు కూడా మార్చిన విషయం తెలిసిందే. ఈసారి ముగ్గురు భారత ప్లేయర్లు, ఒక విదేశీ ఆటగాడిని రిటైన్ చేసుకోవచ్చు. లేదంటే ఇద్దరు భారత ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. లేదంటే ముగ్గురినే రిటైన్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
హాట్ ఫేవరెట్‌గా వార్నర్
ఐపీఎల్ 2021 సీజన్ ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌కు ఒక పీడకల అనే చెప్పాలి. ఎప్పుడూ లేని విధంగా ఫామ్ కోల్పోయిన వార్నర్ ఫామ్‌తో పాటు కెప్టెన్సీ, టీమ్‌లో స్థానాన్ని కోల్పోయాడు. డేవిడ్ వార్నర్‌ను చూసి హైదరాబాద్ ఫ్యాన్స్ ఎంతగానో భావోద్వేగానికి గురయ్యారు. ఈ మధ్య జరుగుతున్న అప్‌డేట్స్ చూసి వార్నర్ వచ్చే సీజన్‌లో హైదరాబాద్ టీమ్‌లో ఉండడని తెలుస్తోంది. అతను కూడా సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ అందుకు ఆజ్యం పోస్తున్నాయి. రిటైన్ పాలసీ మారడంతో హైదరాబాద్ టీమ్ వార్నర్‌ను రిటైన్ చేసుకునే అవకాశం కన్పించడంలేదు. విదేశీ ఆటగాళ్ల కోటాలో కేన్ మామ, రషీద్ ఖాన్‌లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా చూసుకుంటే డేవిడ్ వార్నర్ వేలంలోకి వస్తాడు.
వార్నర్ కోసం ఐదు ఫ్రాంచైజీల ఆరాటం
వేలంలోకి డేవిడ్ వార్నర్ వస్తే దక్కించుకునేందుకు దాదాపు ఐదు ఫ్రాచైజీలు ఆరంటంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీకి కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగనని ప్రకటించడంతో వారికి ఒక సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అవసరముంది. వార్నర్ దక్కించుకునేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ కూడా వార్నర్ కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. కొత్త ఫ్రాంచైజీలు కూడా వార్నర్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఎందుకంటే వారికి మంచి కెప్టెన్‌తో పాటు స్టార్‌డమ్ ఉన్న ప్లేయర్ కూడా కావాలి కాబట్టి. వాలెట్ మొత్తం కూడా పెరగడంతో ఎంతకైనా దక్కించుకోవచ్చు. ఈ లెక్కల ప్రకారం వార్నర్‌కు ఎలా కాదన్నా రూ.14 కోట్లు వరకు రావొచ్చని అంచనా.
అయితే ఇదంతా టీ20 ప్రపంచకప్‌లో అతను చేసే ప్రదర్శన పైనే ఆధారపడి ఉంటుంది. ఈ సీజన్ తరహాలోనే టీ20 వరల్ట్ కప్‌లోనూ విఫలమైతే వార్నర్ ఈ సారి వేలంలో బంగపాటు తప్పదు.
ఇదీ చదవండి: ఎవరీ ప్రీతమ్ జుకల్కర్.. సమంతతో అతనికి ఎలా పరిచయం ఏర్పడింది?