‘ఆనంద’మానందమాయే… జగపతిబాబు బ్రాండ్ అంబాసిడర్ అయ్యే!!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య త‌యారు చేస్తోన్న క‌రోనా మందు పంపిణీ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఆనందయ్య మందుకు టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. తాను ఆనందయ్య మందు అందరికంటే ముందే తీసుకున్నానని.. తనకు కరోనా రాలేదని ప్రకటించారు. ఆయన మాటలతో ప్రజల్లో ఆనందయ్య మందుపై మరింత నమ్మకం పెరిగింది. నెల్లూరు జిల్లా మ‌నుబోలు మండ‌లంలో ఆనంద‌య్య ఔష‌ధం పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ ఈ ఔష‌ధాన్ని ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల్లో కొంద‌రికి మందు అందించారు. కొవిడ్ సోకిన వారికి ఎరుపు రంగు ప్యాకెట్‌ లోని మందు, క‌రోనా రాని వారికి ముందు జాగ్ర‌త్త‌గా నీలం రంగు ప్యాకెట్‌ లోని మందును ఇస్తున్నారు.

arrangements

మ‌రోవైపు, కృష్ణ‌ప‌ట్నం పంచాయ‌తీ ప‌రిధిలో 144 సెక్ష‌న్‌ను తొల‌గించారు. రోజుకి రెండు వేల నుంచి మూడు వేలమందికి ఆనందయ్య మందును పంపిణీ చేయ‌నున్నారు. కేవలం సర్వేపల్లి వాసులకు మాత్రమే మందు పంపిణీ చేస్తున్నామని ఇతర ప్రాంతాల వారు రావద్దని ఆనందయ్య కోరుతున్నారు. త్వరలో మిగిలిన ప్రాంతాలకు పంపిణీ చేస్తామని కూడా చెప్పారు. పాజిటీవ్ వచ్చిన వారిని వాలంటీర్లు గుర్తించారు. వారికి ఈ మందు ఇస్తున్నారు. సుమారు లక్ష మందికి ఆనందయ్య మందు అందే అవకాశం ఉంది. అలాగే కరోనా రాకుండా ఉండే మందు కూడా పింపిణీకి సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయుర్వేద మందుకు రాష్ట్రంలో గిరాకీ పెరిగిపోయింది. ఆయుర్వేద మందుల అమ్మకాలు ఎన్నడూ లేనంతగా ఈ కరోనా సమయంలో వంద నుంచి రెండు వందల శాతం పెరగడమే అందుకు నిదర్శనం. ఆనందయ్య మందు కరోనా నుంచి కాపాడుతుందని అధికారికంగా ఎవరూ నిర్ధారించలేదు. కేవలం ఆనందయ్య మందు వల్ల ఎలాంటి హాని జరగదు అని మాత్రమే నివేదిక ఉంది. అయినా చాలామంది కరోనా రాకుండా ఉండేందుకు ఆనందయ్య మందు ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు.