బతుకుదెరువు కోసమని పట్టణానికి వచ్చిన డ్రైవర్ భార్యపై పక్కింట్లో ఉంటున్న కుర్రాడు కన్నేశాడు. డ్రైవర్ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి కుంటి సాకులతో వివాహితతో పరిచయం పెంచుకున్నాడు. అదును చూసి తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలంటూ తన కామ చేష్టలను ప్రదర్శించాడు. అందుకు ఆ వివాహిత తనకు పెళ్లై.. కూతురు కూడా ఉందని చెప్పడంతోపాటు మరోసారి తన ఇంటి గడప తొక్కితే బాగుండదని వార్నింగ్ కూడా ఇచ్చింది. దాంతో ఆ వివాహితపై కక్ష పెంచుకున్న ఆ యువకుడు బతుకుదెరువు కోసం వచ్చిన డ్రైవర్ దంపతులకు కడుపుకోత మిగిల్చాడు.
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా కోపోలి పట్టణంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఖాదిర్, షాలిని దంపతులు బతుకుదెరువు కోసం కోపోలి పట్టణానికి రాగా, వారు అద్దెకు తీసుకున్న ఇంటిపక్కనే ఉన్న సుల్తాన్ అనే యువకుడు ఇంట్లోకి ప్రవేశించి షాలినిపై అక్రమ సంబంధం కోసం ఒత్తిడి తీసుకొచ్చేవాడని, అందుకు షాలిని ఒప్పుకోకపోవడంతో కక్ష పెంచుకున్న సుల్తాన్.. షాలిని కుమార్తె రెహనా (4)ను అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
అంతకు ముందు రెహనా కనిపించకపోవడంతో వెతికే క్రమంలో కోపోలి శివారు ప్రాంతంలోని ఓ చెట్టు పొదల్లో తల, మొండెం వేరైన రెహనా మృతదేహం కనిపించిందని పోలీసులు చెప్పారు. డ్రైవర్ ఖాదిర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుల్తాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం తెలిసిందని, రెహనాను హత్య చేసింది తానేనని సుల్తాన్ విచారణలో అంగీకరించాడని పోలీసుల తెలిపారు.