
కరోనా వైరస్ కారణంగా మనుష్యులు సామాజిక దూరం పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రభుత్వాలు, వైద్యాధికారులు చెబుతున్నారు. కానీ కొందరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా బారిన పడుతుండగా, మరికొంతమంది ఈ మహమ్మారి బారిన పడి మృత్యువాత పడుతున్నారు. ఇక కరోనాతో మృతిచెందిన వారికి కనీసం దహనసంస్కారాలు కూడా సరిగ్గా జరగడం లేదు. కుటుంబసభ్యులు కూడా తమ బంధువు కరోనాతో మరణిస్తే, కనీసం శవాన్ని చూడటానికి కూడా రావడం లేదు.
అయితే ఇదే అదనుగా భావించిన కొందరు మాత్రం కరోనా మృతదేహాలను కూడా వదలడం లేదు. తాజాగా విజయనగరంలోని కోవిడ్ ఆస్పత్రి సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టానికి చెందిన ఓ మహిళ కరోనా వైరస్‌కు చికిత్స పొందుతూ మృతిచెందింది. దీంతో విమ్స్ కోవిడ్ ఆస్పత్రి సిబ్బంది ఆ మృతదేహంపై ఉన్న 5 తులాల బంగారంతో పాటు చేతి ఉంగరాలు కూడా మాయం చేశారు. ఆ మృతదేహాన్ని బంధువులకు చూపించకుండానే అంత్యక్రియలకు తరలిస్తుండగా, శ్మశానంలో కుటుంబసభ్యులు ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది.
కరోనా మృతదేహం కాబట్టి ఎవరూ రారనే నమ్మకంతో ఆసుపత్రి సిబ్బంది ఇలాంటి నీచమైన పనికి ఒడిగట్టారని పలువురు మండిపడుతున్నారు. చివరకు మృతదేహాలపై ఉన్న వస్తువులను కూడా స్వాహా చేస్తున్నారంటే, వారు ఎంత దిగజారారో అర్ధం చేసుకోవచ్చని కుటుంబ సభ్యులు అంటున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించడంతో ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.