
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయితే ఇతరుల ద్వారా కరోనా సోకకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. కానీ అందరినీ ఆశ్యర్యానికి, ఒకింత భయాందోళనకు గురిచేస్తున్న సరికొత్త విషయాలు పరిశోధనల్లో వెల్లడవుతున్నాయి. ఇప్పటికే ఇతరులతో దగ్గరగా ఉంటూ మాట్లాడినా, వారు దగ్గినా, తుమ్మినా ఎదుటివారికి కరోనా సోకే ప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడించారు.
కాగా తాజాగా గట్టిగా మాట్లాడినా, పాట పాడినా, అరిచినా వైరస్ వ్యాప్తి జరుగుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడయ్యింది. ‘‘ద బీఎంజే’’ జర్నల్ తాజాగా ఈ అంశాన్ని వెల్లడించింది. కరోనా పాజిటివ్ వ్యక్తులు పై విధంగా చేసినట్లయితే కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతోందని పరిశోధనల్లో తేలినట్లు నిపుణులు అంటున్నారు. ఇటీవల అమెరికాలో ఒక మ్యూజిక్ కన్సర్ట్ లో పాల్గొన్న గాయకుడి ద్వారా 52 మందికి కరోనా వైరస్ సోకినట్లుగా వారు తేల్చారు.
మొత్తానికి కరోనా సోకిన వ్యక్తి నోరు తెరిస్తే మనం క్వారంటైన్లో పడుకోవాల్సిందే అంటున్నారు వైద్యులు. అందుకే మాస్కులు ధరించడం ఇప్పుడు బాధ్యత కాదు, ప్రాణాలను దక్కించుకునే మార్గం అని వైద్యులు అంటున్నారు. ఏదేమైనా, ఎంత అత్యవసరమైనా మాస్కు లేకుండా బయట అడుగుపెడితే మన ప్రాణాలను మనమే రిస్క్‌లో పెట్టినవాళ్లం అవుతామని వైద్యులు అంటున్నారు.