సార్వత్రిక ఎన్నికల గడువు రాకెట్ వేగంతో దూసుకొస్తున్న నేపథ్యంలో ఏపీ రాకీయ పార్టీలు తమ కార్యకలాపాలను వేగవంతం చేశాయి. అభ్యర్ధుల ఎంపిక నుంచి నామినేషన్ ప్రక్రియ, మేనిఫెస్టో, ప్రచారం ఇలా అన్ని విషయాల్లోనూ రాజకీయ పార్టీల అధినేతలు ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇదే సమయంలో అప్పటి వరకు టికెట్ ఆశించి చివరి నిమిషంలో భంగపడిన నేతలు ఏకంగా కండువా పార్టీల మార్చేస్తున్నారు.
ఆ క్రమంలోనే వైఎస్ఆర్కు అత్యంత సన్నిహితుడు, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీకే బాబు నేడు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. అయితే సీకే బాబు మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరాలనుకున్నా అక్కడి పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోవడంతో టీడీపీలో చేరినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. మరికొద్ది సేపట్లో సీకే బాబు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల తన అనుచరగణంతో నిర్వహించిన సమావేశంలో సీకే బాబు వెల్లడించారు.
ఈ సందర్భంగా సీకే బాబు మీడియాతో మాట్లాడుతూ, తాను చిత్తూరు జిల్లాలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని, తాను దివంగత సీఎం వైఎస్ఆర్కు అత్యంత సన్నిహితుడినని, వైఎస్ఆర్ తనతో ప్రతీ విషయాన్ని చర్చించే వారన్నారు. కానీ, ఆయన కుమారుడు వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. జగన్ వైఖరితో ఆ పార్టీలోని సీనియర్ నేతలు ఇప్పికే టీడీపీలో చేరారన్నారు.
తాను కూడా మొదటగా వైసీపీలో చేరాలనుకున్నానని, కానీ ఆ పార్టీలో పరిస్థితుల గురించి నేతలు చెప్పిన విషయాలను విని తాను విస్తుపోయినట్టు సీకే బాబు చెప్పుకొచ్చారు. ఏపీ విభజన అనంతరం రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు చేసిన కష్టం ఊరికే పోదని, చంద్రబాబు కష్టాన్ని గుర్తించిన ప్రజలు ఆయన్ను మళ్లీ సీఎం చేసేందుకు సిద్ధమయ్యారని, వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని సీకే బాబు తెలిపారు.