వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై వైఎస్ షర్మిల తొలి సారి స్పందించారు. కాగా, ఇవాళ అమరావతి వేదికగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య మీ కుటుంబ సభ్యులే చేశారని చంద్రబాబు అంటున్నారు, ఆ ఆరోపణపై మీ స్పందన ఏంటి..? అని అడిగిన మీడియా ప్రతినిధులకు వైఎస్ షర్మిల తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
తమ ఫ్యామిలీలో గొడవలు లేవని, ఒక వేళ ఉన్నా హత్యలు చేసుకుంటామా..? అని వైఎస్ షర్మిల ఎదురు ప్రశ్నించారు. తమ పెదనాన్న జార్జిరెడ్డి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లేరని, వారిద్దరి తరువాత మూడో స్థానంలో ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి తమ కుటుంబ పెద్దగా ఉన్నారన్నారు. అలాంటి మా కుటుంబ పెద్దను అతి దారుణంగా చంపారన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి డెడ్‌బాడీని చూస్తే ఆయన్ను చంపింది మనుషులా..? లేక మృగాలా..? అన్న అనుమానం వస్తుందన్నారు. ఆ హత్యా నిందను మళ్లీ మా కుటుంబంపైనే వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. వివేకానందరెడ్డిని హత్య చేసింది నూటికి నూరుశాతం చంద్రబాబు ప్రభుత్వమేనని వైఎస్ షర్మిల విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చంపించడమే కాకుండా హత్య చేసిన వాళ్లకు పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తుందన్నారు.