ఏపీలో ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో కొందరు రాజకీయ నాయకులు ప్రలోబాల పర్వానికి తెర తీశారు. దొడ్డిదారిలో గెలుపొందేందుకు ఓటర్లను ప్రలోబాలకు గురి చేస్తున్నారు. అందులో భాగంగా అధికారుల కళ్లుగప్పి మరీ మద్యం, ఫ్రిజ్‌లు, టీవీలు, ఓటర్ల అవసరాలను గుర్తించి వాటిని ఓట్లతో ముడిపెట్టి గెలుపొందేందుకు యత్నిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో ప్రలోబాల పర్వం..
అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ రాజకీయ పార్టీ ప్రలోబాల పర్వానికి తెరతీసింది. అయితే, అనంతపురం జిల్లాలో చేనేతలు అధిక సంఖ్యలో ఉన్న సంగతి తెలిసిందే. వారి ఓటర్లను టార్గెట్ చేసుకున్న ఓ రాజకీయ పార్టీ ఓట్లు కోసం మగ్గాల పంపిణీకి తెరతీసింది. అర్ధరాత్రి వేళ ప్రభుత్వ గోదాముకు మగ్గాలను తరలించింది.
ప్రలోబాల పర్వాన్ని అడ్డుకున్న వైసీపీ..
అర్ధరాత్రి ప్రభుత్వ గోడౌన్‌కు లారీలో మగ్గాల తరలిస్తున్నట్టు సమాచారం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నారు. స్థానిక ఎన్నికల అధికారులకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన అధికారులు లారీని, చేనేత మగ్గాలను సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇదే విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు అనంతపురం వైసీపీ నేతలు తెలిపారు.