తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపారు. రాష్ట్రంలో వచ్చే నెలలో పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి.. అందుకోసం పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలన్నారు.
టీవీ మీడియాలో చర్చలకు ఇకపై TRS తరఫున ఎవరూ వెళ్లవద్దని, ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే వెంటనే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. తెలంగాణభవన్‌లో జరిగిన TRS విస్తృత స్థాయి సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల మాదిరే అన్ని ఛైర్మన్ పదవులూ మనకే దక్కాలని.. మెజారిటీ వార్డులు, డివిజన్లు గెలవాలని అన్నారు.
పార్టీ సభ్యత్వ నమోదు వచ్చే నెల 20 వరకు నిర్వహిస్తామని, కోటిమందికి పైగా సభ్యత్వాలు నమోదు కావాలన్నారు. కాళేశ్వరం నీళ్లు వచ్చే నెలలో పొలాలకు చేరతాయన్నారు. ఈ ప్రాజెక్టుతో పాటు మిషన్ భగీరథ పూర్తయిందని, ఇక పాలమూరు-రంగారెడ్డిపై దృష్టి సారిస్తామన్నారు.