జమ్మూకాశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఉగ్రదాడిపై కచ్చితంగా బదులు తీర్చుకుంటామని కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హెచ్చరించారు. ఉగ్రదాడి నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ జమ్మూకాశ్మీర్‌కు వెళ్లనున్నారు. పుల్వామాలో పరిస్థితిని సమీక్షించనున్నారు. ఉగ్రదాడికి సంబంధించి పోలీసులతో సమావేశాలు నిర్వహించి వివరాలపై రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీయనున్నారు. అనంతరం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న జవాన్లను రాజ్‌నాథ్ సింగ్ పరామర్శిస్తారు.
మరో వైపు కేంద్ర కేబినేట్ కూడా మరికొద్ది సేపట్లో సమావేశం కానుంది. సెక్యూరిటీ సహా ఇతర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. అలు జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడితో ప్రస్తుత పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. సౌత్ కాశ్మీర్లో ప్రభుత్వం ఇటర్నెట్ సేవలను నిలిపివేసింది.
మరోవైపు సీఆర్పీఎఫ్ బలగాలపై దాడికి సంబందించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బలగాలు భారీ సంఖ్యలో శ్రీనగర్‌కు వెళ్లడంపై ఉగ్రవాదులకు ముందుగానే సమాచారం లీకై ఉండొచ్చని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. జవాన్లలో చాలా మంది సెలవులను ముగించుకుని వస్తున్నవారే ఎక్కువగా ఉన్నారు. భారీ సంఖ్యలో వాహనాలు కదులుతున్న సమయంలో అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దీంతో స్థానికులు కొందరు సీఆర్పీఎఫ్ బలగాలు ప్రయాణిస్తున్న వాహాలకు సంబంధించిన సమాచారాన్ని ఉగ్రవాదులకు చేరవేసి ఉండొచ్చని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. అయితే, కాశ్మీర్లో ఉగ్రవాదులకు సహకారం అందించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఆశ్రయం ఇవ్వడం, ఆయుధాలను తరలించడం వంటి వాటిలో వారి పాత్ర ఎక్కువగానే ఉంటుంది.
సాధారణంగా భారత్ బలగాల తరలింపులో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక్కసారి వెయ్యి మందికి మించి తరలించ కూడదు. కానీ, ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూ శ్రీగర్ రహదారిపై రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. మరో వైపు ఇవాళ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పర్యటన కూడా ఉంది. దీంతో గురువారం నాడే 2,547 మందిని తరలించాల్సి వచ్చింది. భారీ కాన్వాయ్‌గా జవాన్లు బయల్దేరారు. ఇదే సందర్భంలో ముందుగానే హైవేపై తనిఖీలను నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే ఉగ్రవాదులు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్ధమవుతుంది.
ఉగ్రవాదులు తమకు సహకరించే స్థానికుల ద్వారా సీఆర్పీఎఫ్ బలగాల కాన్వాయ్ ఏ సమయంలో ఎక్కడ ఉందో తెలుసుకుంటూ దాని ప్రకారం దాడి చేసినట్లు తెలుస్తుంది. పైగా హైవేపై రద్దీ ఎక్కువగా ఉండటంతో జవాన్ల కాన్వాయ్ వేగం కాస్త తక్కువగా ఉంది. ఇది కూడా ఉగ్రవాదులకు కలిసొచ్చింది. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే పది కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది.