వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికల్లో తన పార్టీ గెలుపుకోసం ఏపీ వ్యాప్తంగా ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా శుక్రవారం రాయలసీమలో పర్యటించిన వైఎస్ జగన్ నేడు శ్రీకాకుళంలో పర్యటిస్తున్నారు. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో వైఎస్ జగన్ పాల్గొని మాట్లాడుతూ ఎండనుసైతం లెక్కచేయకుండా సభకు వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోనే తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేశానని, ఆ సమయంలో ప్రజల బాధలు వినడంతోపాటు కళ్లారా చూసినట్టు జగన్ చెప్పారు. మీ అందరి సమస్యలు విన్నాను.. మీ బాధలు తీర్చే బాధ్యత నాది అంటూ జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
చంద్రబాబు గురించి మాట్లాడిన జగన్ విమర్శల వర్షం కురిపించారు. తిత్లీ తుఫాన్ బాధితులకు ఇప్పటికీ సహాయం సరిగ్గా అందలేదని, బాధిత కుటుంబాలు ఇప్పటికీ రోడ్డుపైనే జీవితాన్ని గడుపుతున్నారన్నారు. అలాగే కిడ్నీ బాధితులు వేల సంఖ్యలో ఉంటే వారిని గుర్తించని ప్రభుత్వం కేవలం 370 మందికే పింఛన్ ఇవ్వడం అన్యాయం కాదా..? అని జగన్ ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి రాగానే కేవలం రెండు సంవత్సరాల్లోనే కిడ్నీ బాధితులకు ఉచితంగా మందులు అందజేస్తామని, రిజర్వాయర్ల నుంచి కాల్వల ద్వారా సాగునీరు, తాగునీరు అందించే బాధ్యతను తాను తీసుకుంటానని జగన్ తెలిపారు.