తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. నామినేషన్లకు గడువు ఇంకా మూడు రోజులే మిగిలి ఉండటం అందులోను శుక్రవారం కావడంతో ఈ రోజు నామినేషన్లు భారీగా దాఖలు కానున్నాయి. ఏపీలో వివిధ రాజకీయ పార్టీల అగ్ర నేతలు ఇవాళ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తరుపున స్థానిక టీడీపీ నేతలు నామినేషన్లను దాఖలు చేయనున్నారు.
అలాగే, గుంటూరు జిల్లా మంగళగిరిలో గత కొన్ని రోజులుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న లోకేశ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేస్తారు. మంగళగిరిలో ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పిస్తారు. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా ఈ రోజే నామినేషన్ను దాఖలు చేయనున్నారు. కడప జిల్లా పులివెందులలో వైఎస్ జగన్ ఇవాళ నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేయనున్నారు.