జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను చెప్పిన విధంగానే రాజకీయాల్లో నడుచుకుంటున్నారు. జనసేన ఏ ఒక్క కులానికి సొంతం కాదని, మతాలకు జనసేన అతీతమని ఆ పార్టీ స్థాపన రోజున పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అలా చెప్పిన సమయంలో పొలిటికల్ ఎంట్రీ సమయాల్లో అందరులానే పవన్ ప్రసంగించారని, అయినా కులాలు, మతాల ప్రస్తావన లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా నిలదొక్కుకోలేదంటూ మరికొందరు సషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపించారు. కానీ, పవన్ మాత్రం తన పార్టీ స్థాపన సందర్భంగా చేసిన ప్రసంగం, వాగ్దానాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నారు.
ఆ విషయమే పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. అయితే, ఏపీలో ఎన్నికల సందర్భంగా నామినేషన్ల పర్వం ఊపందుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రోజున మంచి ముహూర్తబలం ఉందని పండితులు చెప్పడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ నామినేషన్లను ఎన్నికల అధికారులకు సమర్పించారు.
పవన్ కళ్యాణ్ తాను ఎన్నికల అధికారులకు సమర్పించిన నామినేషన్ పత్రాల్లో తన మత, కుల ప్రస్తావన వద్ద ఎటువంటి వివరాలను పొందుపరచలేదని జనసేన శ్రేణులు చెబుతున్నారు. కేవలం ఒక్క పవన్ మాత్రమే కాకుండా ఇటీవల జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, మరికొందరు నేతలు పార్టీ అధినేత దారిలోనే నడుస్తూ కుల, మత వివరాలను నామినేషన్ పత్రాల్లో పొందుపరచలేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు నామినేషన్ పత్రాల్లో అన్ని వివరాలను పొందుపరచాల్సి ఉన్న నేపథ్యంలో పవన్ ఇలా కుల, మత ప్రస్తావనను పేర్కొనకపోవడంతో నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందన్న అంశం తెరపైకి రావడంతో జనసేన శ్రేణులు కాస్త ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తుంది.