అభివృద్దిలో తెలంగాణ మరింత స్పీడ్ ని పెంచేసింది.. ఎన్నికలకు ముందే మరికొన్ని కొత్త జిల్లాలను ప్రకటిస్తాను అని హామీ ఇచ్చిన కేసిఆర్ చెప్పినట్లుగానే మరో రెండు జిల్లాలకు గ్రీన్ సింగ్నల్ ఇచ్చేశాడు. రేపటినుండి తెలంగాణలో మరో రెండు జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. అవే నారాయణపేట, ములుగు జిల్లాలు. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ఈ రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి 2018 డిసెంబర్ 31వ తేదీన ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే వాటిపై అభ్యంతరాలు, వినతులు స్వీకరించారు. వాటన్నింటి పరిశీలించిన తరువాత నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు ఇవాళ రెవెన్యూశాఖ తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది.
అనంతరం రేపటి నుండి ఈ కొత్త జిల్లాలు ఉనికిలోకి వస్తాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 31 నుండి 33కు చేరనుంది. ఈ కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఇతర అధికారులను కూడా ఈరోజే నియమించనున్నారు. రేపటినుండే వారు తమ విధుల్లో చేరుతారు. ఇదిలాఉంటే మరికొన్ని జిల్లాలకు కూడా కొత్త కలెక్టర్లను ఈరోజే నియమించే అవకాశం ఉందని సమాచారం.