కృష్ణా కరకట్ట వెంబడి అక్రమ నిర్మాణాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్ కొరడా ఝులిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతతో అక్రమ కట్టడాల తొలగింపును జగన్ ప్రభుత్వం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉంటున్న నివాసం సహా మరో 28 అక్రమ నిర్మాణదారుల యజమానులకు నోటీసులు జారీ చేసింది.
అందులో భాగంగా చంద్రబాబు నివాసానికి సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ నరేంద్ర స్వయంగా వచ్చి నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. నోటీసులకు వివరణ ఇవ్వకుంటే భవనాలను తొలగిస్తామని హెచ్చరించారు. కరకట్ట వెంబడి వంద మీటర్లలోపు 50 అక్రమ కట్టడాలను గుర్తించిన సీఆర్డీఏ అధికారులు భవన యజమానులకు నోటీసులు అందజేశారు.