ప్రముఖ నటి, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల అకాల మృతి తనను ఎంతో బాధించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ముందుగా విజయనిర్మల భౌతికఖాయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ పూలమాలేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను సినీ ఇండస్ట్రీకి పరిచయంకాక ముందు చెన్నైలో విజయనిర్మల ఇంటి ముందే తామూ ఉండేవారమని, ఆ సమయంలో నరేష్, వారబ్బాయి నవీన్‌తో బంధం ఏర్పడిందని పవన్ గుర్తు చేసుకున్నారు.
విజయ నిర్మల కేవలం నటిగానే కాకుండా మహిళా దర్శకురాలిగా గిన్నీస్ బుక్ రికార్డును సొంతం చేసుకున్న ఘనత, ఆమె సినిమాలు సాధించిన ఘన విజయాలు అందరికీ స్ఫూర్తినిచ్చాయని పవన్ కళ్యాన్ అన్నారు. అటువంటి సినీ కళామతల్లి ముద్దుబిడ్డ దూరం కావడం చాలా బాధించిందన్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణకు, నరేష్, నవీన్‌లకు తన ప్రగాడసానుభూతి తెలియజేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.