టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తమతో పొత్తు కుదుర్చుకుంటే ఏపీ ఎన్నికల్లో నిలదొక్కుకోగలుగుతుందని, అలా కాదని ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం ఒక్కటంటే.. ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా దక్కించుకునే అవకాశం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ అన్నారు. కాగా కేఏ పాల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాను చెప్పిన విధంగా జనసేనతో పొత్తుపై తమ పార్టీ ప్రజాశాంతి ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నారని వెల్లడించారు. ఆ చర్చలకు సంబంధించిన మరిన్ని వివరాలను అతి త్వరలో మీడియాకు వెళ్లడించనున్నట్లు కే.ఏ.పాల్ తెలిపారు.
అయితే తాము తీసుకున్న ఈ నిర్ణయంతో పవన్ పార్టీ జనసేనకే ఎక్కువ లాభం చేకూరుతుందన్న అభిప్రాయాన్ని కే.ఏ.పాల్ వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీలో చేరేందుకు ఏపీ అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీల నుంచి పలువురు ముఖ్య నేతలు రెడీగా ఉన్నారని, సమయం, సందర్భం చూసుకుని వారంతా కూడా ప్రజాశాంతి పార్టీలో చేరుతారని కే.ఏ.పాల్ అన్నారు.