Home General కొత్త సంవత్సరంలో పాత ప్రధానేనా? (పూర్తి విశ్లేష‌ణ‌)

కొత్త సంవత్సరంలో పాత ప్రధానేనా? (పూర్తి విశ్లేష‌ణ‌)

మ‌రికొన్ని గంట‌ల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం…కొత్త సంవత్సరం అనగానే కొత్త ఆలోచనలు,కొత్త ప్రభుత్వాలు,కొత్త కార్యక్రమాలు ఆనవాయితీ… ఈసారి కొత్త సంవత్సరంలో మరో ఐదారు మాసాల తర్వాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా?ఈ ప్రభుత్వమే తిరిగి పగ్గాలు చేపడుతుందా? పన్నెండు మాసాల క్రితం అయితే, ప్రధానమంత్రి నరేంద్రమోడీయే తిరిగి అధికారంలోకి వస్తారని ఎవరిని అడిగినా ఢంకా భజాయించి చెప్పేవారు.ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. నరేంద్రమోడీపై ఒక్కసారిగా వ్యతిరేకత కమ్ముకుంది.ఇందుకు కారణం స్వయం కృతమే. నరేంద్రమోడీ గత పార్లమెంటు ఎన్నికల ముందు ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేశారు.

గుజరాత్‌ తరహా అభివృద్ధిని దేశ మంతటా సాధిస్తానంటే ప్రజలు ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.గుజరాత్‌ అల్లర్లను పదే పదే గుర్తు చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌,వామపక్షాలు ఎంత తీవ్ర స్థాయిలో ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోలేదు.ఉజ్వల్‌ గుజరాత్‌ మాదిరిగానే ఉజ్వల్‌ భారత్‌ నినాదంతో ఆయన ప్రజల మద్దతును పొందగలిగారు. అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాల్లోనే ఆయన పాలనపై తన ముద్ర పడేట్టు చేయడం కోసం తొలి ప్రధాని నెహ్రూ ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘాన్నీ, ఆయన ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలనూ రద్దు చేసి నీతి ఆయోగ్‌ అనే సంస్థకు ప్రణాళికా సంఘం బాధ్యతలను అప్పగించారు. కొత్త వ్యవస్థలో ప్రజలకు మేలు జరగకపోవడంతో నిరాశా నిస్పృహలు కమ్ముకున్నాయి.

ఆ తర్వాత రెండేళ్ళకు పెద్ద నోట్లను రద్దుచేసి సామాన్య,మధ్యతరగతి ప్రజల సహనానికి పరీక్ష పెట్టారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ హయాంలో మేటలు వేసిన అవినీతి అనుకొండలను కూలదోస్తానన్న మోడీ పాలనలో దేశంలో ఎన్నడూ లేని విధంగా బ్యాంకు కుంభకోణాలు వెలుగు చూశాయి. మరో వంక కాంగ్రెస్‌ నాయకత్వాన్ని పార్టీఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్వీకరించారు.కేవలం వారసత్వ రాజకీయాల వల్ల పార్టీ అత్యున్నత పదవిని చేపట్టినా,ఆయన పార్టీని నడపలేరన్న అంచనాలకు భిన్నంగా, తన నాయకత్వాన్ని దిటవు చేసుకోవడానికి దేశ మంతటా కలయ దిరిగి కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఆశలను రేకెత్తించారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అధికారంలోకి రావడంతో రాహుల్‌ పై నమ్మకం పెరిగింది.ఆయన కూడా ఈ ఉత్సహాంతోనే వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో మోడీని గద్దె దింపేందుకు ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి

తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.అందుకు నాందిగా తెలంగాణలో ప్రజాకూటమిని ఏర్పాటు చేశారు.ఆ కూటమికి పెద్దగా సీట్లు రాకపోవడంతో ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలపై పెదవి విరుపులు ప్రారంభమయ్యాయి. రాహుల్‌ నాయకత్వాన్ని సమర్ధించేందుకు బిఎస్‌పీ, సమాజ్‌ వాదీ,తృణమూల్‌ కాంగ్రెస్‌ లు సిద్ధంగా లేవు.డిఎంకె మాత్రమే రాహుల్‌ ప్రధాని కావాలని బహిరంగంగా ప్రకటించింది.తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తెలంగాణ ఎన్నికల్లో ప్రజా కూటమి వైఫల్యంతో రాహుల్‌ ని ప్రధానిగా చేస్తానని తాను అనలేదంటూ మాట మార్చారు.

తెలంగాణ ఎన్నికల్లో తెరాస ఘనవిజయంతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు యత్నాలను తెలంగాణ ముఖ్యమంత్రి,తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ ముమ్మరం చేశారు.ఒడిషా, బెంగాల్‌ ముఖ్యమంత్రులతో మంతనాలు జరిపి 2018 చివరలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు పునాదులు వేయడం ప్రారంభించారు.ఆయన ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో అప్పుడే చెప్పలేం. మన దేశంలో కూటములు,ఐక్యసంఘటనలు ఏర్పడటం కొత్తకాదు.అవి ఎంత కాలం మనుగడ సాగిస్తాయన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి.

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం మనది…అయినా, ఎన్నికలు ఎప్పుడు జరిగినా 70 శాతంమందిమాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బ్యాలెట్‌ పత్రాలు ఉన్నప్పుడు పెట్టెలను తారుమారు చేసేవారు. అలాంటి అక్రమాల నిరోధానికి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను ప్రవేశపెట్టినా, వాటిలో కూడా అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే సీటు గెలవాలంటే 20 కోట్లు ఖర్చు చేయాల్సిందేనని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఎంపీ సీటుకు ఎంత ఖర్చు చేయాలో ఎవరి మటుకు వారు ఊహించుకోవల్సిందే.

స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో ఎన్నికల్ల ో పోటీ చేయడానికి విద్యావంతులు, మేధావులు, ఉన్నతాశయాలు కలిగిన వారూ ముందుకు వచ్చేవారు.ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఎన్నికల ప్రచారానికే కొండంత భారం మీద పడుతోంది.ఈ నేపధ్యంలోఎన్నికల్లో పోటీ చేసేందుకు సేవానురక్తి కలిగినవారు ఆసక్తి చూపడం లేదు..రాజకీయ పార్టీలు సిద్ధాంతాలను గాలికి వదిలేసి వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నాయి. అరవైవ దశకం చివరలో ప్రారంభమైన వ్యక్తి ఆకర్ష రాజకీయాలు ఎన్నో మలుపులు తీసుకుని ఇప్పుడు పూర్తిగా కుటుంబ పార్టీల పాలన సాగుతోంది. గతంలో కాంగ్రెస్‌ని మాత్రమే కుటుంబ పార్టీగా జనం చెప్పుకునే వారు.

ఇప్పుడు అన్ని పార్టీల్లో ఆ సంస్కృతి తిష్ట వేసింది.దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే తత్వం నాయకుల్లో పెరిగి పోవడం వల్ల తాము అధికారంలో ఉండగానే వారసులకు పాలనా బాధ్యతలను అప్పగిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్ధుల ఎంపిక ఢిల్లిdలో జరుగుతుందంటూ గతంలో ఇతర పార్టీలు ఎద్దేవా చేసేవి.ఇప్పుడు అన్ని పార్టీలూ అదే పద్దతిని అనుసరిస్తున్నాయి.ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా ఎప్పుడో ముద్ర పడ్డాయి. అధికారమే పరమావధిగా పార్టీలూ,నాయకులూ వ్యవహరిస్తున్న నేపధ్యంలో విలువలు, ప్రమాణాలూ వెనక్కి వెళ్ళిపోయాయి. గెలుపుగుర్రాలకే టికెట్లు అని పార్టీల నాయకత్వాలు పబ్లిగ్గానే ప్రకటిస్తున్నాయి.

గెలుపునకు ప్రజాసేవారంగంలో సుదీర్ఘమైన అనుభవం గతంలో ప్రామాణికంగా ఉండేది.ఇప్పుడు ఎవరెంత ఖర్చు పెట్టగలిగితే వారినే అభ్యర్ధిత్వం వరిస్తోంది.డబ్బు మాత్రమే కాకుండా,ఓటర్లను మద్యం మత్తులో ఓలలాడించడంలో ఎవరు ఎంత సమర్దులో వారికే టికెట్లు దక్కుతున్నాయి. ఏడు దశాబ్దాలు పైబడిన ప్రజాస్వామ్య దేశంలో మన సాధించిన ప్రగతి ఇది ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో మన దేశ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కష్టమే. .. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ ఏకచ్ఛత్రాధిపత్యంగా కేంద్రంలో,రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగింది.

రాజ్యాంగ నిర్మాత,రిపబ్లికన్‌ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌, భారతీయ జనతాపార్టీ (బిజేపీ) మాతృక అయిన భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ వంటి ప్రతిపక్ష అగ్రనేతలంతా ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో,ఆ పార్టీ మంత్రివర్గాల్లో కొనసాగిన వారే. సైద్ధాంతికమైన విభేదాలతోనే వారంతా వేర్వేరు పార్టీలు నెలకొల్పి ప్రతిపక్ష నాయకులుగా సుదీర్ఘ కాలం ప్రజల పక్షాన పోరాడారు. వామపక్షాల నాయకులు,సోషలిస్టు పార్టీ నాయకులంతా స్వాతంత్య్రోద్యమ కాలంలో కాంగ్రెస్‌ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించిన వారే.ఇప్పుడు దేశంలో రెండే జాతీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి నూటముప్పయి సంవత్సరాల నాటి కాంగ్రెస్‌ , రెండు భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్‌ అనువంశిక పాలనను అందిస్తోందన్న కారణంగా ఆపార్టీని గద్దె దింపి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అందించేందుకు ఎమర్జెన్సీ అనంతరం ఏర్పడిన జనతాపార్టీ కాలం నుంచి ఇప్పటి జాతీయ ప్రజాస్వామ్య ఐక్య సంఘటన (ఎన్‌డిఏ)వరకూ చాలా కూటములు అధికారంలోకి వచ్చాయి.రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయి.

కాంగ్రెస్‌ కూడా ఏక పార్టీ పాలన సాధ్యంకాదన్న నిర్ధారణకు వచ్చి భావసారూప్యం గల పార్టీలతో సమైక్య ప్రగతి శీల ఐక్య సంఘటనను (యూపీఏను) ఏర్పాటు చేసి కేంద్రంలో పదేళ్ళ పాటు అధికారంలో కొనసాగింది.ఎన్‌ డిఏ, యూపీఏ కూటములు రెండింటిలో ప్రాంతీయ పార్టీలు ప్రధాన భాగస్వామ్య పక్షాలయ్యాయి. ఈ కూటముల వల్ల ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో,రాష్ట్రాల్లో అధికారం పంచుకునేందుకు మహత్తర అవకాశం లభించింది.

అంతేకాక,ప్రాంతీయ పార్టీల వాణికి కూటమికి సారథ్యం వహించే జాతీయ పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెట్టాయి. ఈ రెండు కూటముల్లో భాగస్వామ్యం పొందినా తమకు ప్రాధాన్యం లభించడం లేదన్న అభిప్రాయంతో ప్రాంతీయ పార్టీలే కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.అవి ఎంతవరకూ ఫలిస్తాయో మరి. స్వాతంత్య్ర్రానంతరం దేశంలో వామపక్ష ఉద్యమం ఒక దశలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగాఎదిగింది.తర్వాత ఆ ఉద్యమం చీలికలు, పీలికలు కావడంతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ప్రాంతీయ పార్టీల తోపొత్తుతో సీట్లు,ఓట్లపై తమదృష్టిని ఎక్కువగా కేంద్రీకరిస్తున్నాయి.ఈ క్రమంలోఅవి తమ అస్తిత్వం కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి.

తొలి సంకీర్ణ ప్రభుత్వం:
కేంద్రంలో తొలి సంకీర్ణ కూటమిని పూర్తి పదవీకాల పరిమితి పూర్తి అయ్యేవరకూ నడిపిన ఘనత మాజీ ప్రధాని అటల్‌ బిహారీవాజ్‌ పేయిదే.ఎన్‌డిఏ-1ప్రభుత్వ పాలన జనరంజకంగానే సాగింది.దేశవ్యాప్తంగా
జాతీయ రహదారుల (ఆరులైన్లు,నాలుగు లైన్ల) అభివృద్ధి కారణంగా మౌలిక సదుపాయాలు బాగా వృద్ది చెందాయి.ఆ తర్వాత పదేళ్ళు వరుసగా అధికారంలో కొనసాగిన కాంగ్రెస్‌ నేతృత్వంలోనియూపీఏ కూటమిని సంఘటితంగా నిలపడంలో అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాత్ర ఎనలేనిది. కాంగ్రెస్‌ పార్టీకి 20 సంవత్సరాల పాటు అధ్యక్షురాలుగా వ్యవహరించి ఆ పార్టీకి రాష్ట్రాల్లో,కేంద్రంలో పూర్వ వైభవం కల్పించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు.యాపీఏ పాలనలో అమలు చేసిన రుణమాఫీ, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ ,జాతీయ ఆహార పథకం వంటి పథకాలన్నీ ఆమె మానసిక పుత్రికలే. అయితే, యూపీఏ-2 హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాలు ఆ కూటమి ప్రతిష్ఠను మసకబార్చాయి.

మోడీపై భ్రమలు తొలగాయి: సరిగ్గా అదే సమయంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలనానుభవాన్ని సంపాదించిన బీజేపీ నాయకుడు నరేంద్రమోడీ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి దేశ ప్రజలల్లో సరికొత్త ఆశలు రేకెత్తించారు. అవినీతి రహిత పాలనను అందిస్తాననీ, విదేశీ బ్యాంకుల్లో పేరుకుని పోయిన భారతీయుల నల్లధనరాశులనువందరోజుల్లో తవ్వి తెచ్చి ప్రతి భారతీయునికి 15 లక్షలు వంతున పంచుతానని వాగ్దానం చేయడమే కాకుండా, ఆకాశవాణి మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ద్వారా ప్రతినెలా ప్రజలతోముచ్చటిస్తూ వారికి గట్టి నమ్మకాన్ని కలిగించారు. కానీ ,ఆయన ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయారు.

అంతేకాక, దేశంలో నల్లధనం గుట్టలను వెలికి తీయడానికని చెప్పి రెండు సంవత్సరాల క్రితం వెయ్యి,ఐదొందల రూపాయిల నోట్లను రద్దు చేసి సామాన్య,మధ్యతరగతి వర్గాలు రోడ్డున పడేట్టు చేశారు. ఈ ఒక్క చర్యతోనే మోడీపై సగటు భారతీయుడు పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి. మోడీ గ్రాఫ్‌ పడిపోవడం ప్రారంభమైంది కూడా అప్పుడే. అప్పటి వరకూ 56 అంగుళాల ఛాతీ గలిగిన శక్తిమాన్‌ గా ప్రశంసలు అందుకున్నమోడీ పై భ్రమలు ఇంత త్వరగానే తొలగి పోతాయని విశేషఅనుభవం ఉన్న రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోయారు.

ముఖ్యంగా, పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులు,వస్తు, సేవా పన్ను (జిఎస్టీ) వల్ల చిన్న వర్తకులు ఎంతో నష్టపోయారు. మూడు రాష్ట్రాల అసెంబ్లిd ఎన్నికల్లో బిజేపీ పరాజయం తర్వాత దాదాపు 90 శాతం వస్తువులపై జిఎస్‌టిని 18 శాతానికి తగ్గించారు. అవినీతి అనుకొండ: కాంగ్రెస్‌ పాలనలో అవినీతి గురించి అదే పనిగా దుమ్మెత్తి పోసిన ప్రధానమంత్రి మోడీ తన పాలనలో అవినీతి కుంభకోణాలు బహిర్గతం అవుతుండటం తోఈ మధ్య అవినీతి ఊసెత్తడం లేదు. రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై నీలి నీడలు,సిబీఐ డైరక్టర్ల మధ్య తగాదా, రిజర్వు బ్యాంకు వ్యవహారాలో ప్రభుత్వ జోక్యంతో సహా పలు ఆరోపణలు మోడీ పట్ల ప్రజలవిశ్వాసం బాగా సడలింది.

ఈ ఏడాది ఆరంభం వరకూ ఆయనకు తిరుగులేదనీ,మళ్ళీ ఆయనే అధికారంలోకి వస్తారని జోస్యం చెప్పిన విశ్లేషకులు తమ అంచనాలను తిరగరాస్తున్నారు. మోడీ హావభావాలతో ప్రసంగిస్తూ ప్రజలను ఇప్పటికీ ఆకట్టుకుంటున్నారు.అదే ఆయన బలం. అలాగే, ప్రతిపక్షాలను దుయ్యబట్టడంలో ఆరితేరిన మోడీ తమ సొంత పార్టీ నాయకులను కట్టడి చేయలేకపోతున్నారు అది ఆయన బలహీనత.ఆయన ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్‌,జన్‌ ధన్‌, మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా వంటి పథకాలు ప్రచారం జరిగినంతగా అమలు కావడం లేదుఅయితే, ఉత్తరాదిన గ్రామీణ మహిళలనుఆకట్టుకోవడానికి ఉజ్వల పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఉచితంగా వంటగ్యాస్‌ కనెక్షన్లు అందించడం ద్వారా అట్టడుగు వర్గాలకు చేరువయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మోడీ గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో 45పైగా దేశాల్లో పర్యటించారు.విదేశీ ప్రయాణాల కోసం ప్రజాధనాన్ని నీళ్ళప్రాయంగా ఖర్చు చేస్తున్నారన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.

పార్టీలో, ప్రభుత్వంలో సీనియర్లను గుర్తించకపోవడం,క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ఎల్‌కె అద్వానీ వంటి కురువృద్ధ నాయకులను పట్టించుకోకపోవడం మోడీపై వచ్చిన ఆరోపణల్లో ముఖ్యమైనవి. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాని గుడ్డిగా నమ్మడం ఆయన బలహీనత.అమిత్‌ షాకోసం ఆయన ప్రతిపక్షాల విమర్శలనుఎదుర్కొన్న సందర్బాలు ఉన్నాయి. రాహుల్‌ గ్రాఫ్‌ పెరిగింది: మోడీ వైఫల్యాలు సహజంగానే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి కలిసి వచ్చాయి. పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టమని ఎంత ఒత్తిడి వచ్చినా ఎంతో కాలంగా తిరస్కరిస్తూ వచ్చిన రాహుల్‌ తల్లి సోనియా గాంధీ అనారోగ్యం దృష్ట్యా ఎట్టకేలకు పార్టీ సారథ్యం చేపట్టిన రాహుల్‌ దూకుడుపెంచారు.

మోడీపై నేరుగా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు.గతంలో రాహుల్‌ను పప్పు అన్నవారే ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి పదవిని చేపడితే తమకు ఎటువంటి అభ్యంతరం లేదంటున్నారు. ఉత్తరప్రదేశ్‌ కి చెందిన సమాజ్‌ వాదీపార్టీ నాయకుడు,మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌,బహుజన సమాజ్‌ పార్టీ అధ్యక్షురాలు మాయావతిలకు రాహుల్‌ ని మోడికి ప్రత్యామ్నాయ నాయకునిగా అంగీకరించేందుకు సుముఖంగా లేరు.అలాగే, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ కూడా రాహుల్‌ నాయకత్వం పట్ల అభ్యంతరాలు ఉన్నాయి.

అయితే, రాహుల్‌ కూడా తన మనసులోని మాట బయటపెట్టకుండా,ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. పార్టీలో సీనియర్‌ నాయకులను పక్కన పెట్టడం,యువతరం ప్రతినిధులను వెంటపెట్టుకుని తిరగడం ఆయన లోని బలహీనత. అయితే, గతంలో మాదిరి సెలవులు పెట్టి అజ్ఞాత ప్రదేశాలకు వెళ్ళి పోకుండా పార్టీ కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు.అది ఆయనలో వచ్చిన మార్పు.ప్రసంగాల్లో కూడా ఆయన గతంలో మాదిరి కొబ్బరి జ్యూస్‌ అనే పదాలు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అదే సందర్భంలో ఇటీవల ఎన్నికలప్రచారంలో బీజేపీ కి కౌంటర్‌గా దేవాలయాలను సందర్శించడం, మత కార్యక్రమాలకు తరచూ హాజరు కావడం వంటి బలహీనతలను బయట పెట్టుకుంటున్నారు.

మహాకూటమి సన్నాహాలు: ఆరునూరైనా మోడీని గద్దె దించి తీరాల్సిందేనన్న ప్రతినతో చంద్రబాబునాయుడు బీజేపీయేతర పార్టీల నాయకులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ ను అంటరాని పార్టీగా పరిగణించిన ఇప్పుడు ఆపార్టీతో జత కట్టి తెలంగాణ ఎన్నికల ప్రచారం జరిపారు.కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల ప్రమాణానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. అయితే, ప్రధానమంత్రి పదవిపై తనకు ఆశలేదని ఈమధ్యనే స్పష్టం చేశారు. మమత మనసులో ఏముందో? ప్రశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా ప్రధానమంత్రి పదవి మీద ఆశ ఉన్నప్పటికీ,ఆమె మనసులో మాట బయటపెట్టడం లేదు.

అయితే, తన అభ్యర్ధి త్వాన్ని సమర్ధించనందుకే ఆమె కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉంటున్నారన్న కథనాలు వెలువడుతున్నాయి.చం ద్రబాబు నాయుడు ఏర్పాటు చేయ తలపెట్టిన మహాకూటమికి కూడా ఆమె మద్దతు ప్రకటించలేదు. ప్రతిపక్షాల ఐక్యత మోడీకి శ్రీరామరక్ష అని కొద్ది రోజుల క్రితం జనం అనుకున్నట్టు ఇప్పుడు అనుకోవడం లేదు. మోడీని గద్దె దించేందుకు అంతా సుముఖంగా ఉన్నారు. అయితే, ఆ తర్వాత నాయకత్వం ఎవరు చేపట్టాలనే దానిపై ఏకాభిప్రాయం లేదు. కమలనాథుల ధైర్యానికి కారణం అదే| ఈ అభిప్రాయాన్ని ఇటీవల అసెంబ్లిd ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీయే స్వయంగా స్పష్టం చేశారు.

దీటైన నాయకుడు ఎవరు? మోడీకి దీటైన నాయకుడు ఎవరన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి పాలనానుభవం లేదు.ఆయనకు కుటుంబ వారసత్వంద్వారానే కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి లభించింది.యూపీఏ పదేళ్ళ పాలనలో ఆయన పార్లమెంటు సభ్యునిగా కొనసాగినా మంత్రి పదవిని చేపట్టలేదు. అప్పుడు కనీసం సహాయ మంత్రిగానైనా పని చేసి ఉంటే పాలనా వ్యవహారాల్లో కొంతైనా అనుభవం గడించి ఉండేవారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ పాలనా దక్షుడే కానీ, ఆయన బలం మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకే పరిమితం. బహుజన సమాజ్‌ పార్టీఅధ్యక్షురాలు మాయావతికి,

సమాజ్‌ వాదీ పార్టీ యువనాయకుడు అఖిలేష్‌ కీ ముఖ్యమంత్రులుగా అనుభవం ఉన్నప్పటికీ వారికి జాతీయస్థాయిలో అందరినీ కూడగట్టుకునే సత్తా లేదు.చంద్రబాబునాయుడుకు అపారమైన పాలనానుభవం ఉన్నప్పటికీ, తన సేవలు ఆంధ్రప్రదేశ్‌ కే పరిమితం అని ఆయన ఇటీవల కూడాప్రకటించారు. మమతా బెనర్జీ నాయకత్వాన్ని అందరూ సమర్ధించే పరిస్థితి లేదు. పైగా, ప్రధానమంత్రి పదవి ఉత్తరాది రాష్ట్రాలకే చెందాలనూ,అందునా అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ కే చెందాలన్న సెంటిమెంటు ఉంది.తర్వాత అతిపెద్ద రాష్ట్రమైన బీహార్‌ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న నీతీశ్‌ కుమార్‌ని గత ఎన్నికల్లో మోడీకి ప్రత్యర్ధిగా నిలబెట్టేందుకు మమతా బెనర్జీ ప్రయత్నించారు.

ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో నితీశ్‌ కుమార్‌ ఎన్‌డిఏలో చేరడంతో ఇప్పుడు ఆయనకు అవకాశాలు పూర్తిగా మృగ్యమయ్యాయి.నితీశ్‌ తనకు పోటీ దారు కాకుండా చేసుకోవడంలో మోడీ యత్నాలు ఫలించాయి. రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని అందరూ సమర్ధించకపోవడంతో బిజేపీని ఎట్టి పరిస్థితులలోనే అధికారంలోకి రానివ్వరాదన్న ఉద్దేశ్యంతో కర్నాటక ఫార్ములాను అమలు జరిపేందుకు ప్రతిపక్షాలు ఆలోచన చేస్తున్నాయి.కర్నాటకలో 37 అసెంబ్లిd స్థానాలు గెల్చుకున్న జనతాదళ్‌ (ఎస్‌ ) నాయకుడు కుమారస్వామి అయినట్టే ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడినో ప్రధానమంత్రి పదవి వరించే అవకాశం ఉంది.బీజేపీ నుంచి అధికారం చేజారి పోకుండా సంఘ్‌ పరివార్‌ నాయకత్వం రంగంలో ప్రవేశించి బిజేపీలో మోడీ కి ప్రత్యామ్నాయంగా మరో నాయకుడిని ప్రోత్సహించవచ్చు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని ప్రధానమంత్రి చేయాలన్న ఆలోచన పరివార్‌ నాయకులలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.ఆంధ్రప్రదేశ్‌ లో 25 లోక్‌ సభ స్థానాలను తెలుగుదేశం కైవసం చేసుకుంటే కేంద్రంలో చక్రం తిప్పవచ్చని చంద్రబాబునాయుడు ఆశిస్తున్నారు.

మరో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు యత్నాలు కొలిక్కి వస్తే జాతీయ రాజకీయాల్లోప్రవేశించి కీలక పాత్ర వహించేందుకు కేసీఆర్‌ ఆశలు పెట్టుకున్నారు.ఇందుకు నాందిగా ముఖ్యమంత్రి పదవిని తన కుమారుడు కే తారకరామారావుకు అప్పగించేందుకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని అప్పగించారు. ప్రతిపక్షాల్లో ఐక్యత సాధ్యం కాదన్న ధీమా కమలనాథులలో ఉంది.మళ్ళీ మోడీయే ప్రధానమంత్రి అవుతారని ధీమాగా చెబుతున్నారు.వీరెవరూ కాదని బిజేపీలో మోడీ వ్యతిరేక వర్గాన్నికూడగట్టుకుని చంద్రబాబుకానీ, చంద్రశేఖరరావు కానీ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర వహించవచ్చు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad