వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తమదే అన్న ధీమాను వ్యక్తం చేసేలా అధికార తెలుగుదేశం వ్యూహాత్మకంగా పావులుదు కదుపుతోంది. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకునే వారు ఉన్న పదవులకు రాజీనామా చేసి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, విప్ రామసుబ్బారెడ్డిలకు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేయగా, త్వరలోనే మంత్రులు నారా లోకేశ్‌తోపాటు ఇంకొందరు ఎమ్మెల్సీలు ఇదేబాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయాలనుకుంటే ఎమ్మెల్సీ పదవి ఉంచుకుని చేయడం సబబు కాదన్న అభిప్రాయం పార్టీ అధిష్టానంలో వ్యక్తమవుతోంది. దీంతో ఉన్న పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళితే ధైర్యంగా తమ ధీమాను చాటడంతోపాటు దక్కని వారికి తమ పదవిని బదలాయించవచ్చనే కోణంలో అధినేత చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సమర్ధులైన నాయకుల కోసం అనివార్య పరిస్థితుల దృష్ట్యా కొందరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేక పోవచ్చనే అంశాలను పరిగణలోకి తీసుకుని వారిని ప్రత్యామ్నాయ పదవితో సంతృప్తి పరిచేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇప్పటికే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
నెల్లూరు జిల్లా నుంచే ఎమ్మెల్సీగా మంత్రి పదవిలో కొనసాగుతున్న మంత్రి నారాయణ సైతం రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన పదవీకాలం మార్చి చివరకు ముగియనుంది. ఇక నారా లోకేష్ కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నందున ఈ లోగానే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.