టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఇటీవల చంద్రగిరి నియోజకవర్గం రంగంపేటలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మంచు విష్ణు మాట్లాడుతూ తనకు తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో బంధుగణం ఉందని, వారిలో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, ప్రజా ప్రతినిధులుగా ఉన్నారన్నారు. అత్యంత సన్నిహితులైన వారందరిలోకల్లా తనకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అంటేనే ఎక్కువ ఇష్టమని మంచు విష్ణు అన్నారు.
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని తాను అంతలా ఇష్టపడటానికి గల కారణాన్ని మంచు విష్ణు చెప్పుకొస్తూ.. నెలకు పది రోజులపాటు రంగంపేటలోనే తమ కుటుంబం గడుపుతుందని, అలా రెండు సంవత్సరాల క్రితం సంక్రాంతి పండుగ రోజున రంగంపేటకు వచ్చామన్నారు. అదే సమయంలో చెవిరెడ్డిని ఇంటికి భోజనానికి ఆహ్వానించామన్నారు.
కానీ, చెవిరెడ్డి రాలేడంటూ ఆయన అనుచరుడు ఒకరు వచ్చి చెప్పారని, అందుకు గల కారణం ఏమిటని ఆరా తీస్తే తమ పార్టీ మద్దతు దారులను అధికార పార్టీ అరెస్టు చేసిందని, వారికి లేని పండుగ, తనకెందుకని, వారిని విడిపించేందుకు పోలీసు స్టేషన్ ఎదుటే చెవిరెడ్డి భైఠాయించడం చూసి ఆశ్చర్యపోయానని మంచు విష్ణు అన్నారు.
చెవిరెడ్డికి ఎమ్మెల్యే పదవి ఉండొచ్చు.. డబ్బు ఉండొచ్చు.. అంతకు మించిన మనసు ఉండటం గొప్ప విషయమన్నారు. నమ్మిన వాళ్ల చెయ్యి వదలకుండా, కష్టాల్లోనూ వాళ్లతోనే ఉండాలి అన్న ఒక్క విషయం నాయకుడి లక్షణాల్లో గొప్పదన్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి తన హ్యాట్సాఫ్ అని విష్ణు తన ప్రసంగంలో అన్నారు.