తెలంగాణ సీఎం కేసీఆర్ తన కేబినేట్లో చోటు కల్పించి మంత్రిగా తన పేరును ప్రతిపాదించడం చాలా సంతోషంగా ఉందని ధర్మపురం ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రజా జీవితంలో ఉండి, మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందిన తనకు సీఎం కేసీఆర్ మంత్రి పదవిని కేటాయించి అత్యున్నతమైన గౌరవాన్ని కట్టబెట్టడం చాలా సంతోషకరంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్ గౌరవానికి భంగం వాటిల్లకుండా, తనకు అప్పచెప్పిన బాధ్యతను తూ.చా తప్పకుండా పాటిస్తానన్నారు. తనకు మంత్రి పదవిని కేటాయించడం ప్రజలకు మరింత సేవలందించేందుకు కలిగిన అవకాశంగా తాను భావిస్తున్నానన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని రంగాలను తీర్చిదిద్దే పనిలో ఉన్నారని, ఆ క్రమంలోనే తెరాస ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నీ త్వరితతిన పూర్తవుతున్నాయన్నారు.