వయస్సు ఆరు పదులు దాటినా కోర్కెలను అణచుకోలేని ఆ వృద్డుడు తన కోడలిపైనే కన్నేశాడు. తన కామవాంఛకు తన కొడుకే అడ్డుగా ఉన్నాడని భావించి కాటికి పంపించాడు. పంజాబ్ పరిధిలోని ఫరిదోకోట్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఫరిదోకోట్కు చెందిన చోటాసింగ్ అనే 62 ఏళ్ల వృద్ధుడు తన కోడలిని లొంగదీసుకోవాలన్న భావనతో, అందుకు కొడుకు అడ్డుగా ఉన్నాడన భావించి హత్యకు కుట్ర పన్నాడు.
చోటా సింగ్ ముందుగా అనుకున్న విధంగానే శనివారం అర్థరాత్రి గాఢ నిద్రలో ఉన్న తన కుమారుడు రాజ్విందర్సింగ్ ను దారుణంగా హతమార్చాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు రాజ్విందర్సింగ్ మృతదేహాన్ని తనవెంట తెచ్చుకున్న కత్తితో ముక్కలు ముక్కలుగా కోశాడు. ఆ ముక్కలను డ్రైనేజీలో వేశాడు. ఇంతలో శబ్దం రావడంతో చోటాసింగ్ మేనల్లుడు గురుచాన్ సింగ్ నిద్ర నుంచి మేల్కొని చూడగా, ఇళ్లంతా రక్తంతో నిండిపోయింది. వెను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలించి చోటా సింగ్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన కోడలిపై కన్నేసి కన్న కొడుకునే దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో చోటా సింగ్ ఒప్పుకున్నాడు. చోటా సింగ్ను సోమవారం నాడు కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.