ఇంతకాలం కడలి పాలయ్యే జలాలకు కాళేశ్వరం అడ్డుకట్టగా నిలవబోతోంది. గోదావరిలో తెలంగాణ వాటా జలాల వాడకానికి ఇప్పుడు మార్గం సుగమం అయింది. తెలంగాణలో గోదావరి జలాల వినియోగం 100 టీఎంసీల నుంచి ఏకంగా 600 టీఎంసీలకు పెరగబోతోంది. తెలంగాణలో 45లక్షల ఎకరాలకు సారునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభమైంది.
ప్రారంభోత్సవంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. అక్కడ యాగశాలలో నిర్వహిస్తున్న జల సంకల్ప యాగంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ మంత్రులు, ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ హాజరయ్యారు.