ఏపీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ తరుపున ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఎప్పుడా అని ఆ పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. అయితే, ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరుపున ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆఖరికి నందమూరి సుహాసిని కూకట్పల్లి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలోకి దిగినా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి దూరంగా ఉన్నారు.
నిజానికి హరికృష్ణకు, చంద్రబాబుకు మధ్య గ్యాప్ పెరిగినప్పట్నుంచి జూ.ఎన్టీఆర్ టీడీపీ అధిష్టానానికి కాస్త దూరంగానే ఉంటున్నారు. ఈ కారణం వల్లే జూ.ఎన్టీఆర్ రావాలని టీడీపీ నేతలు ఓపెన్‌గా చెప్పలేకపోతున్నారట. ఒకవేళ అందరూ రావాలని కోరినా ఎన్టీఆర్ రాకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. అయితే, టీడీపీ కార్యకర్తలు మాత్రం హోరా హోరీగా ఎన్నికల సమరం సాగుతున్న వేళ జూ.ఎన్టీఆర్ ప్రచారం కచ్చితంగా ప్లస్ అవుతుందని, ఈ నెల 6 నుంచి జూ.ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని టీడీపీ క్యాడర్ భావిస్తోంది.