ఈ ఏడాది ఏపీలో జరగనున్న ఎన్నికలకు దూరంగా ఉంటాన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ తరువాత మంగళగిరి నుంచే పోటీ చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో తమకు అందని ద్రాక్షగా మారిన నియోజకవర్గంలో విజయకేతనం ఎగరవేయడం, కోర్టుల భవనాల్లో తమను నిత్యం ఇబ్బందులు పెడుతున్న రామకృష్ణారెడ్డిని ఓడించడం రెండూ ఒకేసారి జరిగిపోవాలన్న పంతంతో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది.అభివృద్ధి నుంచి సామాజికవరగాల వరకు అన్ని కోణాల్లో ఎన్నికల అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న టీడీపీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేసుకుంటుందన్న ఉత్కంఠ తెలుగు తమ్ముళ్లలో క్రమంగా పెరుగుతోందట.
ఆ మధ్య సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేశ్ మంగళగిరి నుంచే పోటీ చేస్తారన్న చర్చ టీడీపీలో జోరుగా సాగింది. టీడీపీ చేస్తున్న అభివృద్ధి నినాదానికి మంగళగిరి నియోజకవర్గమే ఉదాహరణ అని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. అలాంటి చోట పార్టీని గెలిపించుకోవడం పార్టీకి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో లోకేశ్‌ను మంగళగిరి నుంచి పోటీ చేయిస్తే బాగుంటుందన్న ప్రతిపాదనను కూడా నాడు అధిష్టానం ముందు ఆ పార్టీ నేతలు ఉంచారన్న సమాచారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.