మంగళగిరి వేదికగా ఈ రోజు మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుపై, ఆ పార్టీ నేతలపై ధ్వజమెత్తారు. గత ఎన్నికల తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఏపీని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారన్నారు. అటువంటి చంద్రబాబుకు మళ్లీ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తే ఏపీలో అభివృద్ధి అన్నదే కానరాకుండా పోతుందన్నారు. రాష్ట్రం దుర్మార్గుల చేతిలోపడి అల్లాడుతుందన్నారు. ప్రజలు మళ్లీ టీడీపీకే ఓటేస్తే మరో ఐదేళ్లు బాధలు అనుభవించాల్సి వస్తుందన్నారు.
తమ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయిన బాధలో తాముంటే ఆయన్ను హత్య చేయించింది వైఎస్ ఫ్యామిలీనేనని చంద్రబాబు చెప్పడం వెనుక ఆయన 40 ఏళ్ల చాణుక్యత ఉందని, ఆ ఆరోపణ చేసి అసలు నిందితులను రక్షించడమే చంద్రబాబు ప్లాన్ అని వైఎస్ షర్మిల చెప్పారు. ఆ క్రమంలోనే వైఎస్ వివేకానందరెడ్డిని వైఎస్ ఫ్యామిలీ హత్య చేయించిందని చంద్రబాబు ఆరోపించారన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో నిజా నిజాలను తేల్చేందుకు దమ్ముంటే.. థర్డ్ పార్టీ విచారణకు ఆదేశించాలని చంద్రబాబుకు వైఎస్ షర్మిల్ సవాల్ విసిరారు.