మోడీ టార్గెట్‌గా, ప్రత్యేక హోదా నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఏపీ కాంగ్రెస్ సిద్ధమైంది. అందులో భాగంగా అనంతపురం నుంచి బస్సు యాత్రను నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. హోదాపై బీజేపీ వెనక్కు తగ్గడం, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ అనుకూలంగా ప్రకటన చేయడంతో కాంగ్రెస్‌పై ప్రజల్లో కాస్త సానుకూల వాతావరణం ఏర్పడిందనే భావనకు ఏపీ కాంగ్రెస్ నేతలు వచ్చారు.
దీనికి టీడీపీ కూడా జై అనడంతో తమకు మంచి రోజులు వచ్చాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన జోష్‌తో ప్రత్యేక హోదా భరోసా పేరుతో ఏపీ కాంగ్రెస్ నాయకత్వం బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. మొదటి రోజు మడకశిర నుంచి మొదలైన యాత్ర హిందూపురం, మడకశిర, రాప్తాడు మీదుగా అనంతపురం చేరుకుంది. ఇవాళ రెండో రోజు గార్లదిన్నె, గుత్తెమీదుగా కర్నూలు జిల్లాలోనికి యాత్ర ప్రవేశించనుంది. 13 రోజులపాటు సాగే ఈ యాత్ర 13 జిల్లాలను కవర్ చేయనుంది. మొత్తం 2,250 కిలోమీటర్లు సాగనుంది.