తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్ ఇంటి వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. దీంతో అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళ స్పృహతప్పి పడిపోయింది. వాస్తవానికి ఈ రోజు నుంచి సీఎం జగన్ ప్రజాదర్బార్ ప్రారంభం కావాలి. కానీ ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో కార్యక్రమాన్ని ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేశారు. ఈ విషయం తెలియని చాలా మంది ప్రజలు జగన్ ఇంటికి వచ్చి.. ఆయన్ను కలవాలంటూ దూసుకెళ్లే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
సీఎం జగన్ గతంలో జులై 1 నుంచి ప్రజాదర్బార్‌ను నిర్వహించేందుకు అనుగుణంగా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతోప్రజా దర్బార్ గురించి విస్తృతమైన ప్రచారం జరగడం రాష్ట్రంలో చాలా చోట్ల నుంచి ప్రజలు వినతులతో ఆయన ఇంటికి చేరుకున్నారు.
సీఎం జగన్ ప్రజాదర్బార్ వాయిదాపడిందని పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినా సీఎంను కలవాలంటూ అంతా ఒక్కసారిగా పరుగున వచ్చారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో స్పృహ తప్పిన మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించారు.