దివంగత అతిలోక సుందరి భర్త .. బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ పై చీటింగ్ కేసు నమోదైంది. సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వహిస్తానంటూ డబ్బుతీసుకుని బోనీ మోసం చేశారంటూ ప్రవీణ్ శ్యామ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ జంగిద్ అనే వ్యక్తి 2018 లో త్వరలో సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ జరగనుందని తమను కలిసి చెప్పాడని.. మీరు కనుక పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు ఆర్జించవచ్చన్నాడని ప్రవీణ్ అంటున్నాడు.
తమను నమ్మించడంతో తాను, తన స్నేహితుడు కలిసి 99లక్షలు ఇచ్చామని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఇప్పటివరకు నిర్వహించకపోగా, తమ డబ్బులు కూడా తమకు తిరిగి ఇవ్వడం లేదని పవన్ జంగిద్, బోని కపూర్ మరి కొందరిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మోసంలో బోనీ పాత్ర కీలకమని ప్రవీణ్ చెప్పుకొస్తున్నాడు. తనతోపాటు మరికొందరు రెండున్నర కోట్ల పైన వీరి చేతిలో మోసపోయారని అంటున్నాడు.