చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు. ఆయన చెప్పే అబద్దాలు, చేసే మోసాలే ఆయన్ను ఆ పదవికి అనర్హుడిని చేశాయని, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాల్సిన వ్యక్తి అవినీతి, అక్రమాలను ప్రోత్సహిస్తే ప్రజలు సహించరని, చంద్రబాబు కూడా ఆ కోవకే చెందిన వాడని టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్‌బాబు అన్నారు.
కాగా, ఇవాళ మంచు మోహన్‌బాబు మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. దాదాపు 3,600 కిలోమీటర్లకు పైగా పాదయాత్రచేసిన జగన్, ఆ సమయంలో ప్రజల సమస్యలను కళ్లారా విన్నారని, పరిష్కారానికి భరోసా ఇచ్చారన్నారు. అంతేకాక, ప్రతీ సామాన్యుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు దరిచేరేలా జగన్ ఇప్పటికే నవరత్నాలను ప్రకటించారని, ఆ నవరత్నాల్లో విద్య, వైద్యం, రైతులు, మహిళల అభివృద్ధి ఇలా ప్రతీ అంశాన్ని పేర్కొన్నారన్నారు.
వైఎస్ జగన్‌ను దొంగ దొంగ అని చంద్రబాబు ప్రతి సభలోనూ చెబుతున్నారని, అటువంటి చంద్రబాబుపై 11 కేసులు ఉన్న విషయం ప్రజలు గమనించాలన్నారు. ఆ కేసులన్నిటిలో తన అధికారాన్ని ఉపయోగించుకుని స్టేలు తెచ్చుకుని బయట తిరుగుతున్న చంద్రబాబు ఎప్పుడో ఒకప్పుడు జైలుకు వెళ్లక తప్పదని మోహన్‌బాబు అన్నారు.