మరికొద్ది నెలల్లో ఏపీ వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ వ్యవస్థాపకులు అన్నారు. కాగా, క్రైస్తవ మత ప్రబోధకులుగా గుర్తింపు పొందిన కే.ఏ.పాల్ ఇటీవల కాలంలో వరుస మీడియా సమావేశాలను నిర్వహిస్తూ ఏపీ రాజకీయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో కే.ఏ.పాల్ మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.
కే.ఏ.పాల్ ఇంకా మాట్లాడుతూ, ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితం కాబోతుందన్నారు. వైసీపీ అధికారంలోకి రాబోతుందన్న వైఎస్ జగన్ ఆశలన్నీ కూడా కలలుగానే మిగిలిపోనున్నాయన్నారు. ఆఖరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కూడా చంద్రబాబు, జగన్‌కు పట్టిన గతే పడుతుందన్నారు. ఈ విషయాన్ని ఇటీవల కొన్ని జాతీయ, అంతర్జాతీయ సర్వే సంస్థలు వెల్లడించాయన్నారు.
క్రైస్తవ మత ప్రబోధికుడుగా సభలు నిర్వహిస్తున్న తనకు విదేశాల నుంచి వస్తున్న ఫండ్స్‌ను ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుఉన్నారని, వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా రానున్న ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూడనున్నారన్నారు. అంతేకాకుండా, ప్రజాశాంతి పార్టీ అధికారం చేపట్టగానే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి తాము పనిచేస్తామని కే.ఏ.పాల్ చెప్పారు.