ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో అమరావతి పూర్తయినట్లు సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చూపించారని వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కాగా, వైఎస్ షర్మిల ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి చేశానని ప్రజలకు అబద్దాలు చెబుతున్నాడని, భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని వైఎస్ షర్మిల విమర్శించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి భరోసా ఉండేది. కానీ, చంద్రబాబు పాలనలో మాత్రం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ భయపడుతూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిన చంద్రబాబు, దానిని వ్యతిరేకించి రాష్ట్రాన్ని పాతికేళ్లు వెనక్కు నెట్టారని వైఎస్ షర్మిల అన్నారు.
చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం చేసిన మొదటి సంతకం హామీని కూడా నెరవేర్చలేదన్నారు. రూ.87వేల కోట్ల రైతు రుణాలను కేవలం రూ.24 వేలే ఉన్నట్టు చూపించి రైతులను మోసం చేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్ షర్మిల విమర్శించారు.