ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త, NRI చిగురుపాటి జయరామ్ హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. జయరామ్ ని అతడి మేనకోడలు శిఖాచౌదరి ప్రియుడే చంపాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దాంతో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాకేష్ రెడ్డి నేర చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
రాకేష్ రెడ్డిపై మాదాపూర్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లలో అనేక కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటె హత్యకు గురయిన జయరామ్ భార్య పద్మశ్రీ, మేనకోడలు శిఖాచౌదరిపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. శిఖా చౌదరిది మొదటి నుండి క్రిమినల్ మైండ్ అని, ఎంత చెప్పిన మారలేదని, కానీ ఇంత పని చేస్తుంది అని మాత్రం అనుకోలేదని కన్నీళ్లు పెట్టుకుంది.
ఇక జయరామ్ ను శిఖాచౌదరి ప్రియుడే హత్య చేశాడని నిర్ధారణకు వచ్చిన కృష్ణాజిల్లా పోలీసులు, అసలు ఈ హత్యకు దారితీసిన కారణాలేంటి ? ఎలా చేశాడు ? ఎవరు సహకరించారు ? అనే విషయాలు అతడి నుంచి రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విచారణలో రాకేష్ రెడ్డి పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు సమాచారం.
అతడు చెప్పిన వివరాల ప్రకారం జయరామ్ కు మెదక్లో “టెక్ట్రాన్ పాలీలెన్స్” కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఉద్యోగులకు సమయానికి జీతం అందక గొడవ చేస్తున్న సమయంలో 2 ఏళ్ళ కిందట నావద్ద రూ.4.50 కోట్ల అప్పు తీసుకున్నాడు. ఆ సమయంలోనే అతడి మేనకోడలు శిఖాచౌదరి నాకు పరిచయం అయింది. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ప్రేమ బలపడడంతో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. దాంతో ఆమె కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టా.
అలాంటి నన్ను ఈమధ్య జయరామ్ బెదిరించాడు. శిఖా చౌదరిని వదిలేయాలని వార్నింగ్ ఇచ్చాడు. చేసేది లేక నాకు ఇవ్వాల్సిన 4.50 కోట్లతో పాటు, శిఖా చౌదరి కోసం ఖర్చు చేసిన కోటి రూపాయలు కూడా ఇస్తే వదిలేస్తానని చెప్పాను. అందుకు ముందు సరే అన్న జయరామ్ తరువాత మాట మార్చాడు. ఇప్పటి వరకూ పైసా ఇవ్వలేదు. దాంతో జనవరి 29న జయరామ్ అమెరికా నుంచి ఇండియా వచ్చినట్లు తెలిసి డబ్బులు అడగడానికి వెళ్లాను. ఎంత అడిగినా అతడు డబ్బులు ఇవ్వకపోయే సరికి తీవ్రస్థాయిలో బెదిరించాను.
దాంతో 31వ రోజూ ఉదయం సమయంలో జయరామ్ ఒంటరిగా మా ఇంటికి వచ్చాడు. నాముందే చాలామందికి ఫోన్ చేసి డబ్బు సర్దుబాటు చేయమని కోరాడు. చివరకు కోస్టల్ బ్యాంక్ లో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి ద్వారా రూ. 6 లక్షలు నా మనుషులకు ఇచ్చాడు. నాకు ఇవ్వాల్సిన మొత్తం రూ.5.5 కోట్లు అయితే కేవలం 6 లక్షలు ఇవ్వడమేంటని జయరామ్ తో మల్లి వాదనకు దిగాను. ఈ గొడవ కాస్త పెద్దదయ్యింది. కోపంలో జయరామ్ పై పిడిగుద్దులు గుద్దాను. అతడు హార్ట్ పేషెంట్ కావడంతో చిన్న దెబ్బలకే చనిపోయాడు.
దాంతో ఏంచేయాలో తెలియక భయంతో మృతదేహాన్ని సాయంత్రం వరకు ఇంట్లో ఉంచుకుని అనంతరం పోలీసుల కంట్లో పడకుండా కారులో తీసుకెళ్లి నందిగామ సమీపంలోని ఐతవరం వద్ద కారు వెనుక సీటులో ఉన్న అతడిని బయటకు తీసి స్టీరింగ్ సీటులో కూర్చోపెట్టే ప్రయత్నం చేశాను. కానీ అలా కూర్చోబెట్టడం సాధ్యం కాలేదు, దాంతో చేసేదిలేక అతడి చేతిలో బీరు బాటిల్ ఉంచి.. మరో బీరు బాటిల్ ను రోడ్డుపై పడేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని ప్రయత్నించా, ఆ తరువాత అక్కడి నుంచి బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చాను. అంటూ రాకేష్ రెడ్డి పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది.