ముందుగా అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం పెళ్లిలో డ్యాన్స్ చేయకపోగా, చెల్లించిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని అడిగితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడటంతోపాటు మరికొంత నగదును డిమాండ్ చేసిందని నమోదైన కేసులో బాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్ కోర్టుమెట్లెక్కనుంది.
కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పవన్ శర్మ అనే ఈవెంట్ మేనేజర్ ఓ పెళ్లి కార్యక్రమంలో పాల్గొని డ్యాన్స్ చేసేందుకు బాలీవుడ్ భామ అమీషా పటేల్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడని, అగ్రిమెంట్ ప్రకారం అనుకున్న అడ్వాన్స్ రూ.11 లక్షలను అమీషా పటేల్‌కు ముందుగానే చెల్లించాడని, కానీ అమీషా పటేల్ మాత్రం ఈవెంట్‌కు హాజరు కాలేదన్నారు.
అగ్రిమెంట్ ప్రకారం పెళ్లిలో డ్యాన్స్ చేసేందుకు రాని అమీషా పటేల్‌కు పవన్ శర్మ ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని కోరగా, అందుకు అమీషా పటేల్ చంపేస్తానంటూ బెదిరించడంతోపాటు మరో రెండు లక్షలు డిమాండ్ చేసిందని పవన్ శర్మ తమకు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. కేసు విచారణలో భాగంగా అమీషా పటేల్‌తోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశామని, అందులో భాగంగానే ఈ నెల 12న కోర్టుకు హాజరు కావాలంటూ అమీషా పటేల్‌కు నోటీసులు అందించామని పోలీసులు తెలిపారు.