గుంటూరు జిల్లాలో రైతు ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటనకు ఒక రోజు ముందు కోటయ్య అనే రైతు కొండవీడు ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసుల మీద ఆరోపణలు రావడంతో తమకు ఎలాంటి సంబంధం లేదని వారు చెబుతున్నారు.
అయితే, ఆత్మహత్య చేసుకున్న రైతును కానిస్టేబుల్ భుజాలపైకి ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో వైపు రైతు అనుమతితోనే అతనికి సంబంధించిన పొలంలో కంట్రోల్ రూమును ఏర్పాటు చేశామని, పోలీసులు చెబుతున్నారు.
దాని వల్ల పంటకు ఎలాంటి నష్టం కలగలేదని, ఆత్మహత్య చేసుకున్న రైతు కోటయ్యను ఆస్పత్రికి తీసుకెళుతున్న క్రమంలో కొంత వరకు పంట నష్టం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కొంత మంది పనిగట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు.