గత ఏడాది చివర్లో బాక్సాఫీసు వద్ద టాక్సీవాలా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. విడుదలకు ముందే పైరసీకి గురైనప్పటికీ వసూళ్లను కొల్లగొట్టడంలో ఎక్కడా తడబడలేదు. కథా కథనాలు, దర్శకత్వం, నటీనటుల నటన, టెక్నీషియన్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ కొత్తదనం ఉండటంతో పెట్టుబడిపెట్టిన నిర్మాతలకు కాసులపంట పండింది. అలాగే హీరో విజయ్ దేవరకొండ స్టార్డమ్ను ఇంకొంచెం పెంచింది.
అంతవరకు బాగానే ఉన్న ప్రస్తుతం ఆ చిత్రంలో నటించిన హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ పరిస్థితితే కాస్త డైలమాలో పడిందట. టాక్సీవాలా ఇచ్చిన అవకాశంతో సినిమాలపై మరింత మక్కువ పెంచుకున్న ఈ భామ ప్రస్తుతం అవకాశాలు కోసం ఎదురు చూస్తోందట. ఆఖరకు తొలి సినిమాతోనే హిట్ హీరోయిన్ అనే ట్యాగ్ లైన్ సైతం ఈ భామకు కలిసిరాకపోవడం గమనార్హం.
పాపం.. ఈ అమ్మడి అదృష్టం ఎలా ఉందంటే..! మొన్నటికి మొన్న రవితేజ హీరోగా తాజాగా తెరకెక్కనున్న ఓ చిత్రంలో ఈమెనే హీరోయిన్ అంటూ ప్రియాంక జవాల్కర్ పేరును ఊకదంపుడు కథనాలతో దంచారు. చివరకు ఆ సినిమాలో హీరోయిన్లుగా ఎంపికైన వారి లిస్టులో ఈ అమ్మడి పేరు మిస్ అయింది.
అలాగే అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్లతోపాటు గోపిచంద్ సరసన ప్రియాంక జవాల్కరే హీరోయిన్ అంటూ వరుసగా గాసిప్స్ పుట్టుకు రావడం.. ఆపై అవన్నీ ఫేక్ అని తెలియడం ఇలా ఈ అమ్మడి అవకాశాలకు దెబ్బేస్తున్నాయని ఈ ఫస్ట్ మూవీ హిట్ బేబీ తెగ బాధపడిపోతోందట. ఇలా అవకాశాలు లేక నటనకు దూరమైపోతానేమోనన్న బాధలో ఉన్న ప్రియాంక జవాల్కర్ను ఆదుకునే ఆ నిర్మాత ఎవరో..? ఆ దర్శకుడు ఎవరో..? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు మరీ..!