తెలుగు తెర మీద కళాత్మమైన చిత్రాలకు ప్రాణం పోసిన దర్శకుడు పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాథ్. కథను, కళను కలిపి కమనీయమైన చిత్రాలను అందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్. వెండితెర గర్వించతగ్గ కళాతపస్వి కె.విశ్వనాథ్ సినిమాను కళ్ళతో కాదు మనసుతోనే చూడాలి, వినాలి. అప్పుడే ఆ చిత్రంలోని ఆంతర్యం అర్థమవుతుంది. రేపు కళా దర్శకుడి విశ్వనాథ్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా దర్శకుడు జనార్ధన మహర్షి, విశ్వనాథ్ బయోపిక్ ను ‘విశ్వదర్శనం’ పేరుతో తెరపైకి తీసుకురానున్నారు.
‘విశ్వదర్శనం’ అనే సినిమాకు ‘వెండితెర చెప్పిన బంగారు దర్శకుడి కథ’ అనేది ట్యాగ్ లైన్ ను జోడించారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ చేతుల మీదుగానే టీజర్ ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాతపస్వి కె.విశ్వనాథ్ వారి అనుభూతులను పంచుకున్నారు. “నేనెవరన్నది ప్రపంచానికి తెలియ చేయాలనే దురుద్దేశం నాకు లేదు. నేనేదో గుట్టుగా బ్రతుకుతున్నాను. జనార్ధన మహర్షి ప్రోద్బలం చేత, అతని మనసులో పుట్టిన ఆలోచనకి అతనే నీరు పోసి, నారు పోస్తున్నాడు. నా మీద అభిమానంతో జనార్దనమహర్షి చేస్తున్న ప్రయత్నానికి అతనికి, అతని టీమ్ కు నేను ఎంతో కృతజ్ఞుణ్నున్ని” అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తనికెళ్ల భరణి మాట్లాడుతూ… “విశ్వదర్శనం అంటే విశ్వనాథ్ గారు దర్శించిన సమస్త విషయాలను మనం దర్శించడం. కళాతపస్వి కె.విశ్వనాథ్ గారికి జనార్ధన మహర్షి అభిమాని కాదు, ఒక భక్తుడు. ఆయన ఇండస్ట్రీకి రావడానికి ప్రధాన కారణం కాశీనాధుని విశ్వనాథ్ గారే. గురువు పట్ల కృతజ్ఞతా భావంతో, ప్రేమను, గురు భావాన్ని వ్యక్త పరచడానికి అతను ఈ సినిమా చేస్తున్నాడు” అని అన్నాడు.
దర్శకుడు జనార్ధనమహర్షి మాట్లాడుతూ..”విశ్వనాథ్ గురుంచి మాట్లాడాలంటే మైక్ పట్టుకొని కాదు మమేకమై మాట్లాడాలి అన్నారు. ఈ సినిమాలో కాశీనాధుని విశ్వనాథ్ గురుంచి కన్నా, ఆయన చేసిన సినిమాలతో సమాజం నేర్చుకున్నది, ఆయన వ్యక్తిత్వంను గూర్చి వెండి తెర మాట్లాడుతుందని” అని చెప్పారు.