
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గతకొద్ది రోజులుగా కరోనా వైరస్‌తో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే అంశంపై రోజుకో వార్త సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ వస్తోంది. దీంతో బాలు కుమారుడు ఎస్పీ చరణ్ తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి తప్పుడు వార్తలు ప్రచురించవద్దని కోరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన తండ్రి ఆరోగ్యం ఎలా ఉందనే విషయాన్ని ఎస్పీ చరణ్ తెలిపాడు.
బాలు ప్రస్తుతం డాక్టర్లు అందిస్తున్న వైద్యానికి బాగా రెస్పాండ్ అవుతున్నారని, ఇప్పటికే ఆయనకు వెంటిలేషన్ తీసేసిన విషయాన్ని తెలిపారు. కాగా తాజాగా ఆయన ఆరోగ్యం 90 శాతం మెరుగ్గా ఉందని, ఆయన తన చేతి, కాళ్ల వేలు కదిలిస్తున్నారని చరణ్ తెలిపారు. తన తండ్రి మనుష్యులను గుర్తుపడుతున్నారని, త్వరలోనే కరోనాను జయిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్ధనలు చేస్తున్న అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కాగా ఇటీవల తన తండ్రి ఆరోగ్యం చాలా క్షీణించిందని కన్నీరు పెడుతూ ఎస్పీ చరణ్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోతో తెలుగు ప్రేక్షకులు చాలా ఆందోళనకు గురికాగా, ప్రస్తుతం బాలు కోలుకుంటున్నారనే వార్తతో వారందరూ ఊపిరిపీల్చుకున్నారు.