
ఇటీవల తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ మిర్యాలగూడకు చెందిన ఓ మహిళ హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఆ 139 మంది ఎవరు అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఈ కేసులో సినీ రంగానికి చెందిన వారు కూడా ఉన్నారని, వారిలో ప్రముఖ టాలీవుడ్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో వాటికి ఫుల్స్టాప్ పెట్టేందుకు ప్రదీప్ స్వయంగా రంగంలోకి దిగాడు. తాజాగా ఆయన ఈ అంశంపై క్లారిటీ ఇచ్చాడు. నిజానిజాలు నిర్ధారణ చేసుకోకుండా మీడియా కథనాల్లో ఎలా రాస్తారని ఆయన ప్రశ్నించారు. తన ఫొటోలు వాడుతూ, తన పేరు పెడుతూ కథనాలు రాస్తున్నారని, ఇలాంటి అంశంలో తన పేరు ఎందుకు ఉందో అని కూడా వారు ఆలోచించకుండా దారుణమైన రీతిలో రాసేస్తున్నారంటూ ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశాడు.
పోలీసులు ఈ అంశంపై త్వరలోనే నిజానిజాలు తేలుస్తారని తనకు నమ్మకం ఉందని ప్రదీప్ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో తనకు, తన కుటుంబానికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఏదేమైనా ఓ అత్యాచారం కేసులో తన పేరు రావడం తనను షాక్కు గురిచేసిందంటే, త్వరలోనే అన్ని నిజాలు బట్టబయలు అవుతాయని ఆశించాడు.