
యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌ను షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండస్ట్రీలో నెపోటిజం అనే వివాదం తెరతీయగా, అందులో భాగంగా పలువురు స్టార్స్ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఎప్పుడూ ఏదో ఓ వివాదంలో చిక్కుకునే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, ఇంకా సుశాంత్ సింగ్ విషయంలో నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంది. అయితే బాలీవుడ్‌ను ఎన్నో ఏళ్లుగా డ్రగ్స్ మాఫియా పట్టిపీడిస్తోంది. ఈ క్రమంలో డ్రగ్స్‌తో బాలీవుడ్‌కు ఉన్న సంబంధం గురించి కూడా ఆమె తాజాగా ఓ కామెంట్ చేసింది.
బాలీవుడ్లో 90 శాతం మంది స్టార్స్ డ్రగ్స్ వాడుతారని, దాని కారణంగానే ఇండస్ట్రీ బ్రష్టు పట్టిందని ఆమె వ్యాఖ్యానించింది. కాగా ఓ బాలీవుడ్ స్టార్ హీరోకు డ్రగ్స్ ఎక్కువ మోతాదులో తీసుకునే అలవాటు ఉందని, అందుకే అతడి ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రి పాలయ్యాడని ఆమె చెప్పుకొచ్చింది. సదరు హీరోకు ఉన్న డ్రగ్స్ అలవాటు కారణంగానే అతడి భార్య అతడ్ని విడిచి వెళ్లిపోయిందని, తాను అతడితో డేటింగ్ చేస్తున్న కారణంగా అతడి కుటుంబ సభ్యులు తనను నానా ఇబ్బందులకు గురిచేశారని కంగనా బాంబ్ పేల్చింది.
ఇక బాలీవుడ్లో డ్రగ్స్ సరఫరా చేసేవారు చాలా మంది ఉన్నారని, వారిని పట్టుకుని విచారిస్తే ఇండస్ట్రీలో 90 శాతం మంది జైల్లో ఉండాల్సిందేనని కంగనా చెప్పుకొచ్చింది. తనకు గురువుగా చెప్పుకునే ఓ డైరెక్టర్ ఆమెకు ఈ డ్రగ్స్ అలవాటు చేశాడంటూ కంగనా వ్యాఖ్యానించింది. దీంతో ఇండస్ట్రీలో మరోసారి అలజడి మొదలైందని, కంగనా దెబ్బకు స్టార్స్ అందరికీ చుక్కలు కనిపిస్తున్నాయంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.