
ప్రముఖ లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇటీవల కరోనా వైరస్ బారిన పడినట్లు ఆయన స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందవద్దంటూ ఇటీవల ఆయన తన వీడియోలో తన అభిమానులను కోరారు. కానీ ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు అంటున్నారు. కరోనా వైరస్ సోకిన బాలు, చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఆగస్టు 5న చేరారు.
అప్పటి నుండి కరోనాతో పోరాడుతున్న బాలు ఆరోగ్యం గురువారం నాడు మరింత క్షీణించిందని, దాంతో ఆయన్ను ఐసీయూలోకి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు హెల్త్ బుల్లెటిన్‌ను విడుదల చేశారు. దీంతో ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్స్‌పై చికిత్స అందిస్తున్నామని, వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నట్లు వైద్యలు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్‌గా ఉందని వారు అంటున్నారు.
కాగా ఈ వార్తతో ఒక్కసారిగా సినీ రంగం ఉలిక్కిపడింది. తమను దశాబ్దాల నుండి అలరిస్తూ వస్తోన్న బాలు త్వరగా కోలుకోవాలని వారు కోరుతున్నారు. కాగా పలువురు సినీ ప్రముఖులు బాలు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఈ గానగంధర్వుడు త్వరగా కోరుకోవాలని యావత్ సినీ ప్రపంచం కోరుకుంటోంది.
