
యావత్ భారతదేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉండటంతో అన్ని రంగాలకు చెందిన కార్యకలాపాలు మూతపడ్డాయి. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన ఎలాంటి పని కూడా జరగడం లదు. దీంతో అనేక మంది సినీ కార్మికులు కష్టకాలాన్ని వెల్లదీస్తు్న్నారు. అయితే లాక్డౌన్ నుండి పలు రంగాలకు మినహాయింపు ఇవ్వడంతో వారు తమ పనులు తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో సినిమా రంగానికి కూడా అన్‌లాక్‌లో భాగంగా సినిమా షూటింగ్‌లు నిర్వహించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతినివ్వడంతో సినిమా షూటింగ్‌లను జోరుగా నిర్వహిస్తున్నారు.
అయితే సినిమా థియేటర్లు అందుబాటులో లేకపోయినా సినిమా షూటింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలు వీలైనంత త్వరగా షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు లైన్ కడుతున్నాయి. అయితే కేవలం ఓటీటీలపై నమ్మకంతోనే ఈ తరహా దూకుడు ప్రదర్శిస్తున్నాయనే వాదన ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తమ సినిమాలకు పెట్టిన బడ్జెట్లకంటే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తుండటంతో చిన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర వర్గాలు ఆసక్తి చూపుతున్నాయి.
ఇక టాలీవుడ్లో ఏకంగా 50 చిన్న చిత్రాలకు పైగా షూటింగ్‌లు మొదలుపెట్టుకుని రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాయి. మొత్తానికి లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో సినీ రంగంలో ఎక్కువ మొత్తంలో పనులు జరుగుతున్నాయని పలువురు అంటున్నారు. ఇక పెద్ద సినిమాలు, థియేటర్ల గోల లేని వరకు చిన్న చిత్రాలు ఊపిరి పీల్చుకుంటాయని పలువురు అంటున్నారు. ఏదేమైనా ఓటీటీలు చిన్న సినిమాల పాలిట ఆపద్భందువులా మారిందనేది నిజం.