
ప్రస్తుతం టాలీవుడ్ ఉంటే కేవలం ప్రాంతీయ సినిమా కాదు. అంతర్జాతీయ సినిమాలని సైతం తలదన్నేలా అద్భుతమైన సినిమాలును తెరకెక్కించే సత్తా మన దర్శకనిర్మాతలకు ఉంది. తెలుగు సినిమా స్టామినాను ప్రభాస్ బాహుబలి, సాహోతో ప్రపంచం మొత్తం తెలిసేలా చేశాడు. అందుకే ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్. అతని సినిమాలు వస్తున్నాయంటే ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూస్తుంది. ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని యంగ్ రెబల్ స్టార్ భారీ ప్రాజెక్టులు మాత్రమే అవకాశం ఇస్తున్నాడు. జిల్ ఫ్రేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్నా ‘రాధే శ్యామ్’ మూవీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా తరువాత మహానటితో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్లో సోషియో ఫాంటసీ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే నటిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 500 కోట్లు ఉండనుందని అంచనా. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం డార్లింగ్ మరో భారీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మరియు టి-సిరీస్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ ప్రభాస్ తో మరో సినిమా నిర్మించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సినీ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా భారతీయ జానపద కథల ఆధారంగా తెరకెక్కనుంది. ఈ భారీ పౌరాణిక నాటకానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ సినిమా మహాభారతం ఆధారంగా తెరకెక్కుతుందని అనేక మంది అనుకుంటున్నారు .అయితే దీనిపై ఇంకా స్పష్టమైన సమాచారం రాలేదు. ప్రభాస్ – భూషణ్ కుమార్ కలయికలో ఇది మూడో సినిమా గా రానుంది. ఈ ప్రాజెక్ట్ గాని పట్టాలెక్కితే మరో భారీ ప్రాజెక్ట్ కు నాంది పడినట్టే. దీనిపై మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.